- రేపు తణుకులో సభ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 'రైతు పోరుబాట' పేరుతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రైతులతో కలిసి ఈ నెల 12న పాదయాత్ర, సభ నిర్వహించనున్నారు. తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం నుంచి తణుకు వరకు 12 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. ఈ మేరకు టిడిపి కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో చంద్రబాబు ఈ నెల 4, 5, 6 తేదీల్లో పర్యటించిన విషయం తెలిసిందే. వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ప్రతిపక్షం ఇచ్చిన డెడ్‌లైన్‌పై ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా భారీ స్థాయిలో పోరుబాట కార్యక్రమం నిర్వహించనుంది. 12న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇరగవరం నుంచి తణుకు వరకు పలు గ్రామాల మీదగా యాత్ర సాగనుంది.
- చంద్రబాబును కలిసిన గన్నవరం టిడిపి నేతలు
చంద్రబాబును గన్నవరం టిడిపి కార్యకర్తలు, నేతలు కలిశారు. గన్నవరం టిడిపి కార్యాలయంపై ఫిబ్రవరి 20న దాడి ఘటనను చంద్రబాబుకు ఉండవల్లిలోని నివాసంలో వివరించారు. కార్యాలయంలో ఉన్న కార్లు, ఇతర వాహనాలను తగులబెట్టారని, కార్యకర్తలపై దాడులు చేశారని వివరించారు. బాధితులైన తమపై పోలీసులు కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేశారని తెలిపారు. అక్రమ కేసుల విషయంలో పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు.










