Dec 06,2020 12:09

          సినిమా ప్రపంచమే ఓ మాయా ప్రపంచం. సినిమా వాళ్ల జీవితాలు పైకి కనిపించినంత అందంగా ఉండవు. ఇండిస్టీలో నిలదొక్కుకోవాలంటే సామాన్యులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సినీ కుటుంబాలకు చెందిన వారైతే ఎలాంటి ఇబ్బందులూ ఉండవని భావిస్తార. కానీ సినీ కుటుంబానికి చెందినా తనకూ వేధింపులు తప్పలేదంటోంది హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌. 'నాపై నాకు ఉన్న ఆత్మవిశ్వాసమే ఈరోజు ఇలా మీముందు నిలబెట్టింది ! ' అంటూ ఈ మధ్య ఐశ్వర్య చేసిన వ్యాఖ్యలు దక్షిణాది చిత్రసీమలో చర్చనీయాంశం అవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
         శ్వర్య రాజేష్‌ తమిళంలో పేరున్న హీరోయిన్‌. కొంతకాలం క్రితమే తెలుగులోనూ అరంగేట్రం చేశారామె. కౌసల్య కృష్ణమూర్తి, ఇటీవల తెలుగులో విజరు దేవరకొండ సరసన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమాల్లో నటించారామె. పేరుకు ఆమె తమిళ హీరోయిన్‌ అయినా మన తెలుగమ్మాయే. ఆమె తండ్రి రాజేష్‌ తెలుగులో ఒకప్పుడు మంచి నటుడు. జంధ్యాల తెరకెక్కిం చిన సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఆయన దాదాపు 54 సినిమాల్లో నటించారు. ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్న సమయంలోనే ఆయన మరణించారు. అది ఆ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ. అప్పటికి ఐశ్వర్యకు కేవలం ఎనిమిదేళ్లే. మరో నాలుగేళ్ల తర్వాత ఇంటికి పెద్దదిక్కవుతాడు అనుకున్న ఐశ్వర్య పెద్దన్నయ్య చనిపోయాడు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే మరో అన్నయ్య మరణం ఐశ్వర్య రాజేష్‌ కుటుంబాన్ని అగాథంలోకి నెట్టేసింది.
                                                        నాకూ వేధింపులు తప్పలేదు
          'మా కుటుంబ పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారైంది. అమ్మకు చేదోడు వాదోడుగా ఉండాలని చిన్న వయస్సులోనే నిర్ణయించుకున్నా. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి త్వరగా అవకాశాలు వస్తాయని భావించాను. కానీ ఇండిస్టీలో నాకూ వేధింపులు తప్పలేదు. అవకాశాల కోసం తిరిగా. నీ రంగు ఎలా ఉందో తెలుసా? అద్దంలో ముఖం చూసుకున్నావా? నువ్వు ఇలా ఉన్నావు.. నీకు అవకాశాలు ఎవరిస్తారంటూ ఎగతాళి చేశారు. కొంతమంది తెలిసినవాళ్లూ నువ్వు హీరోయిన్‌వా? అంటూ వెటకారంగా మాట్లాడారు. మరికొందరైతే అక్క, చెల్లి క్యారెక్టర్స్‌ చేసుకో అని చెప్పారు. అయినా ఆ మాటలేవీ పట్టించుకోలేదు. టాలెంట్‌ను నమ్ముకుంటే అవకాశాలు వస్తాయని నమ్మాను. తర్వాత సన్‌టీవీలో 'అస్తోపోవధ్‌యారు' అనే కామెడీ షోలో మూడు సీజన్‌లకు యాంకర్‌గా చేసే అవకాశం వచ్చింది. తర్వాత సీరియల్స్‌లో నటించే అవకాశం వచ్చింది. కానీ పారితోషికం చాలా తక్కువగా ఉండేది. సినిమాల్లో నటించమని అమ్మ ఇచ్చిన సలహాతో మరలా ఇండిస్టీకి వచ్చా. నాపై నాకు ఉన్న ఆత్మవిశ్వాసమే ఈ రోజు ఇలా మీ ముందు నిలబెట్టింది' అంటూ ఆమె ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు దక్షిణాది చిత్రసీమలో చర్చనీయాంశం అవుతున్నాయి. సినిమాలకే పనికిరావన్న ఐశ్వర్య నేడు ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటోంది.

బ్యాక్‌గ్రౌండ్‌ కాదు.. ఆత్మవిశ్వాసం
                                                      జీవితం చావడానికి కాదు
           కెరీర్‌ ఆరంభంలో తమిళ హీరో విజరు సేతుపతితో కలిసి రమ్మీ, పన్నైరమ్‌ చిత్రాల్లో నటించిన ఐశ్వర్య పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవడం ఆమెకు అలవాటు. ఇటీవల అభిమానులతో ముచ్చటించినప్పుడు ఒక అభిమాని 'మీరంటే నాకెంతో ఇష్టం. మీ నటన చాలా బాగుంటుంది. మీ కోసం నేను చావడానికైనా సిద్ధం' అన్నాడు. ఆ మాటలు విన్న ఐశ్వర్య మొదట్లో కొంత కంగారుపడినా.. వెంటనే జీవితం చావడానికి కాదు ఉంది. ఇలాంటి మాటలు మరెప్పుడూ మాట్లాడవద్దని అతనికి హితవు పలికింది.