న్యూఢిల్లీ : పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆశలపై ఈ బడ్జెట్ నీళ్లు చల్లిందని, అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు బడ్జెట్ వల్ల ఒరిగిందేమీ లేదని ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్ విమర్శించింది. రెండు లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తామని చేసిన ప్రకటన బూటకం తప్ప మరేమీ కాదని పేర్కొంది. పోషణ్ 2.0, సాక్షమ్ అంగన్‌వాడీకి బడ్జెట్ కేటాయింపుల్లో పెంపుదల లేదని విమర్శించింది. గత బడ్జెట్‌లో రూ.20,105 కోట్లు కేటాయింపులు వుండగా, ఈసారి చాలా స్వల్పంగా రూ.20,263.07 కోట్లకు పెంచారని, కానీ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుంటే వాస్తవానికి కేటాయింపులు ఇంకా తగ్గుతాయని విమర్శించింది. భారత్ స్థానం 94 నుంచి 101కి దిగజారిందని విమర్శించింది. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా చేసిన అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు చేపట్టలేదని విమర్శించింది. బాలల పోషకాహార హక్కులపై దాడి జరిగిన ఈ బడ్జెట్‌ను తీవ్రంగా నిరసిస్తూ ఎన్‌డిఎ ఎంపిలను ఘెరావ్ చేయడంతో సహా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్ పిలుపిచ్చింది. మార్చిలో జరిగే సమ్మెకు సన్నద్ధమవ్వాల్సిందిగా కోరింది.
కార్పొరేట్ అనుకూల బడ్జెట్ : వ్యవసాయ కార్మిక సంఘం
నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఈ బడ్జెట్ పేదల వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం కేంద్ర వర్కింగ్ కమిటీ విమర్శించింది. పేదలకు అవసరమైన విషయాల్లో కేటాయింపులు తగ్గించి మరోవైపు కార్పొరేట్ సంస్థలకు భారీగా రాయితీలు ఇవ్వాలన్న మోడీ ప్రభుత్వ ప్రాధాన్యత దీంతో తేటతెల్లమవుతోందని విమర్శించింది.
వికలాంగుల అవసరాలపై స్పందనేది? : ఎన్‌పిఆర్‌డి
వికలాంగుల అవసరాలపై ప్రతిస్పందించడంలో ఈ బడ్జెట్ ఘోరంగా విఫలమైందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) విమర్శించింది. తమ అవసరాల పట్ల ప్రభుత్వం దృష్టి సారిస్తుందేమోన్న చిన్న ఆశ రాష్ట్రపతి ప్రసంగంతో కలిగిందని, ఆ మరునాడే కేంద్రం తమ ఆశలను పటాపంచలు చేసిందని విమర్శించింది.










