పశ్చిమ ఆఫ్రికా లోని బుర్కినా ఫాసోలో తిరుగుబాటు ద్వారా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం చేజిక్కించుకున్న సైనిక ముఠాకు ఎలాంటి రాజకీయ చట్టబద్ధత లేదు. పైగా సంక్షోభం మరింత దిగజారడానికే ఇది దారి తీస్తుంది. పశ్చిమ ఆఫ్రికాలో సుస్థిరత ఉన్న దేశాల్లో బుర్కినా ఫాసో ఒకటి. 2015 వరకు అక్కడ జిహాదిస్టు హింస అంతగా లేదు. సోమవారం నాటి మిలిటరీ ముఠా తిరుగుబాటులో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరె ప్రభుత్వం ఎలాంటి ప్రతిఘటన లేకుండానే సరెండరయింది. ప్రజల కడగండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలం కావడం వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. కబోరె 2015లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే సమయంలో అల్‌ఖైదా, ఐఎస్‌కు చెందిన జిహాదిస్టుల కార్యకలాపాలు సహేల్ ప్రాంతం దాకా విస్తరించాయి. బుర్కినా ఫాసోకు ఇరుగు పొరుగున ఉన్న మాలి, నైగర్ వంటి దేశాలు ఇప్పటికే ఇస్లామిస్ట్ హింసతో సతమతమవుతున్నాయి. రెండు కోట్ల ఇరవై లక్షలు జనాభా ఉన్న ఈ చిన్న దేశంలో జిహాదిస్టుల హింస మూలంగా గత ఏడేళ్లలో 2,000 మంది చనిపోయారు. పది లక్షల మంది దాకా నిరాశ్రయులయ్యారు. కబోరె ప్రభుత్వాన్ని అవినీతికర, అసమర్థ ప్రభుత్వంగా మిలిటరీ, అత్యధిక ప్రజానీకం భావించింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై ప్రభుత్వం పట్టు కోల్పోయింది. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభానికి ఆర్థిక సంక్షోభం కూడా తోడుకావడంతో ప్రభుత్వంపై ప్రజల్లో అసమ్మతి పెరిగిపోయింది. రాజధాని ఔగాడోగ్ వీధుల్లోకి జనం వచ్చిన కొద్ది రోజులకే సైనికులు అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. పశ్చిమాఫ్రికాలో ఇటువంటి తిరుగుబాట్లు ఇటీవల కాలంలో సర్వసాధారణం అయ్యాయి. 2021 సెప్టెంబరులో గినియాలో ప్రభుత్వాన్ని ప్రత్యేక సాయుధ బలగాలు తిరుగుబాటు ద్వారా కూల్చివేసి అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. మాలిలో ఏడాది వ్యవధిలోపే అంటే 2021మే లో రెండోసారి తిరుగుబాటు జరిగింది. 2021 మేలో చాద్‌లో సైనిక తిరుగుబాటుదారులతో జరిపిన ఘర్షణల్లో అధ్యక్షుడు చనిపోయారు. అదే సంవత్సరం ఏప్రిల్‌లో సూడాన్‌లో అధికార పంపిణీ ఒప్పందాన్ని తుంగలో తొక్కి కుట్ర ద్వారా సైనిక ముఠా పౌర పాలనను కబళించింది.
దేశాలన్నిటిలో సైనిక జనరల్స్ అధికారం చేజిక్కించుకున్న వైనం ఈ ఖండంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు ఒక హెచ్చరికలాంటిది. కుట్రలు, తిరుగుబాట్ల ద్వారా అధికారం చేపట్టిన ఈ సైనిక ముఠా పాలకులంతా ఎన్నికలు జరిపిస్తామని హామీ ఇస్తున్నారు. అయితే వీరి దృష్టి అంతా అధికారంపై తమ పట్టు ఎలా బిగించాలన్నదానిపైనే. దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించే పేరుతోనో, చట్టబద్ధమైన ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించే పేరుతోనో తమ తిరుగుబాటును సమర్థించుకునే వీరు నిజానికి ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. బుర్కినా ఫాసో తిరుగుబాటు ఉదంతం కూడా దీనికి భిన్నమైనదేమీ కాదు. అయితే ఈ తిరుగుబాటును స్వాగతిస్తూ దేశ రాజధానిలో ప్రదర్శనలు జరిగినట్లు వార్తలచ్చాయి. దీనిని బట్టి జిహాదిస్టుల హింసను పరిష్కరించడంలో ప్రభుత్వ అసమర్థతపై జనం ఎంతగా విసిగిపోయి ఉన్నారో విదితమవుతోంది. యూనిఫామ్ దుస్తుల్లో ఉన్న వారు మెరుగైన భద్రత ఇస్తారని వారు భావించి ఉండొచ్చు. కానీ, ఈ మద్దతు ఎంతో కాలం ఉండదు. అధికార దాహం కలిగిన సైనిక ముఠా పాలకులు జిహాదీ కార్యకలాపాలను సహేల్ అంతటికీ విస్తరించేందుకు యత్నిస్తారు. తిరుగుబాటు అనంతరం సొంత గడ్డపై రాజకీయ విభేదాలు అస్థిరతకు దారి తీస్తాయి. చాలా దేశాలు ఎదుర్కొంటున్న సంక్షోభాలకు సైనిక తిరుగుబాట్లే పరిష్కారంగా చూడడం ఓ విషాదం. సైనిక పాలకులు ఎంత తలకిందులు తపస్సు చేసినా వారికి రాజకీయ చట్టబద్ధత లభించదు గాక లభించదు. పరిస్థితి మరింత దిగజారడం తప్ప!
('ది హిందూ' సంపాదకీయం)










