రాజకీయ ప్రయోజనాల కోసం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టే ముందు ఎవరైనా వెనుకా ముందూ చూసుకోవాలి. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవాలని ఇక్కడి కమ్యూనిస్టులెవరూ తీర్మానాలు చేయలేదు. మన దేశంలోని మూలస్తంభం వంటి పరిశ్రమల్లో ఔషధ రంగం ఒకటి. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వాటిలో 50-60 శాతం వరకు ఈ రంగానికి అవసరమైన రసాయనాలు, సంబంధిత ఉత్పత్తులే అని తెలుసుకోవాలి. ఒక అర్ధరాత్రి అమెరికా వాడు కల లోకి వచ్చి తెల్లవారేసరికి మీరు చైనా వ్యతిరేకతను ప్రచారం చేయాలి అనగానే చిత్తం దేవరా అన్నట్లు చేశారా లేదా? ఎలాంటి ఎజెండా లేకుండానే మన ప్రధాని మోడీ ఊహాన్ వెళ్లి, చైనా అధినేత సీ జిన్‌పింగ్ మహాబలిపురం వచ్చి ఉయ్యాలలూగి, విందులు ఆరగించి, ఊసులు చెప్పుకున్నవారు ఒక్కసారిగా శత్రువులు ఎలా అవుతారు ?
మన పాలకులు, వారికంటే ఎక్కువగా మన మీడియా జనాలకు ఎక్కిస్తున్న దేశభక్తి ఎక్కడికి పోతున్నది? గాంధీ, నెహ్రూ వంటి నేతలు సరైన పునాది వేయని కారణంగా దేశభక్తి అంటే పంద్రాగస్టు, రిపబ్లిక్ దినోత్సవాలకే పరిమితం అయిందని అనుకుందాం కాసేపు. వారి కంటే దేశాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నారు, ప్రపంచానికే గురువు అని చెబుతున్న నరేంద్రమోడీ ఓకల్ ఫర్ లోకల్ (స్ధానిక వస్తువులనే వాడండి), మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, ఆత్మనిర్భరత వగైరా, దేశ కాలాలతో నిమిత్తం లేకుండా ముందుకు తెచ్చిన చైనా వ్యతిరేకత ఏమైనట్లు? ఎక్కడా ఆ ఛాయలే కనిపించటం లేదు.
2021 చైనా-భారత వాణిజ్య లావాదేవీలలో నరేంద్ర మోడీ సర్కార్ ఆల్‌టైం రికార్డు నెలకొల్పింది. డిసెంబరు నాటికి పది వేల కోట్ల డాలర్లకు చేరతాయని అంచనా వేస్తే ఏకంగా 12,600 కోట్ల డాలర్లకు చేరింది. చైనా నుంచి మనం దిగుమతి చేసుకున్నది 9,752 కోట్ల డాలర్లు. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 46.2 శాతం ఎక్కువ. మనం చైనాకు ఎగుమతి చేసిన సరకుల విలువ 2,814 కోట్ల డాలర్లు. అంటే 34.2 శాతం పెరిగిందన్నమాట. మన నుంచి ఎగుమతుల కన్నా దిగుమతులే అధికంగా వున్నందుకు సంతోషించాలా, విచారించాలా? ఎందుకిలా దిగుమతుల రికార్డులను బద్దలు కొడుతున్నాము ?
రాజకీయ ప్రయోజనాల కోసం చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టే ముందు ఎవరైనా వెనుకా ముందూ చూసుకోవాలి. చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవాలని ఇక్కడి కమ్యూనిస్టులెవరూ తీర్మానాలు చేయలేదు. మన దేశంలోని మూలస్తంభం వంటి పరిశ్రమల్లో ఔషధ రంగం ఒకటి. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వాటిలో 50-60 శాతం వరకు ఈ రంగానికి అవసరమైన రసాయనాలు, సంబంధిత ఉత్పత్తులే అని తెలుసుకోవాలి. ఒక అర్ధరాత్రి అమెరికా వాడు కల లోకి వచ్చి తెల్లవారేసరికి మీరు చైనా వ్యతిరేకతను ప్రచారం చేయాలి అనగానే చిత్తం దేవరా అన్నట్లు చేశారా లేదా? ఎలాంటి ఎజెండా లేకుండానే మన ప్రధాని మోడీ ఊహాన్ వెళ్లి, చైనా అధినేత సీ జిన్‌పింగ్ మహాబలిపురం వచ్చి ఉయ్యాలలూగి, విందులు ఆరగించి, ఊసులు చెప్పుకున్నవారు ఒక్కసారిగా శత్రువులు ఎలా అవుతారు? జనం అమాయకులు కాదు కదా !
చైనా నుంచి దిగుమతులను నిలిపివేస్తే అక్కడి నేతలు మన కాళ్ల దగ్గరకు వస్తారని ప్రచారం చేశారు.చైనా తొలిసారిగా ప్రస్తుతం ఏటా ఆరు లక్షల కోట్ల డాలర్ల మేర ఎగుమతి దిగుమతులు జరుపుతున్నది. దానిలో పన్నెండవ వంతు అంటే 75,500 కోట్ల డాలర్ల మేరకు అమెరికాతో జరుగుతున్నాయి. మొదటి స్ధానంలో ఉన్న వారే ఎందుకు పెట్టుకున్నాంరా బాబూ వీరితో తగాదా అని తలలు పట్టుకుంటున్నారు. పదిహేనవ స్ధానంలో నిలిచిన మనతో ఉన్న లావాదేవీలు కేవలం 12,600 కోట్ల డాలర్లు మాత్రమే. అలాంటిది మనం దిగుమతులు ఆపేస్తే చైనా దారికి వస్తుందా? పగటి కలలు గాకపోతే, మరేంటి? వెనుకటి రోజుల్లో పిచ్చి మంత్రం పెడతామని పిల్లల్ని బెదిరించినట్లుగా చైనా యాప్‌ల నిషేధం వలన ఒరిగిందేమిటి? ఔషధ పరిశ్రమకు అవసరమైన దిగుమతులు చేసుకున్నామంటే అర్ధం ఉంది. పోనీ వాటిని కూడా అక్కడి నుంచి గాక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అడ్డుకున్నదెవరు? అమెరికా నేతలతో కౌగిలింతలకు దిగినా మరొకటి చేసినా లావాదేవీలు 2021లో 11 వేల కోట్ల డాలర్లు మాత్రమే. చైనా వస్తువులా అబ్బే అవి నాసిరకం, చౌకరకం అని ఒక వైపు ఈసడించుకుంటారు. కానీ అదే చైనా నుంచి విలాసవంతమైన సెల్‌ఫోన్లు, రంగురాళ్లు, ఆటోమొబైల్స్‌కు మన విలువైన విదేశీమారక నిల్వలను ఖర్చు చేయాలా ?
ఒకవైపు పశ్చిమ దేశాలతో బేరసారాలు, మరోవైపు చైనా మీద అనధికారికంగా తప్పుడు ప్రచారం, ఇంకోవైపు రికార్డులను బద్దలు కొడుతూ దిగుమతులు. పరస్పర విరుద్ధం కదా? ప్రపంచంలో మనకు విలువ ఉంటుందా? చైనాను పక్కన పెట్టి పశ్చిమ దేశాలతో సంబంధాలు పెట్టుకొని జనాన్ని ఉద్ధరించమనండి. ఎవరు వద్దన్నారు. కావలసింది పిల్లి ఎలుకలను పడుతుందా లేదా అన్నది తప్ప నల్లదా తెల్లదా అన్నది కాదు. చైనాతో సంబంధాలను వెనక్కు మళ్లించుకొనేందుకు అమెరికా వంటి బడా దేశాల వల్లనే కావటం లేదు, చైనా మూడు చెరువుల నీరు తాగిస్తున్నది. చైనా వస్తువుల మీద అక్రమంగా దిగుమతి పన్ను విధించటం చట్టవిరుద్ధమని జనవరి 16న ప్రపంచ వాణిజ్య సంస్ధ తీర్పు ఇచ్చింది. అంతే కాదు, పరిహారంగా అమెరికా వస్తువుల మీద 64.5 కోట్ల డాలర్ల మేర ఏటా పన్నులు విధించుకోవచ్చని కూడా తీర్పు ఇచ్చింది. నిబంధనలకు చెప్పిన భాష్యం అంతా తొండి, మొత్తంగా ప్రపంచ వాణిజ్య సంస్థనే సంస్కరించాలని అమెరికా ఇప్పుడు గోలగోల చేస్తున్నది.
ఇక్కడ జనం తీవ్రంగా ఆలోచించాలి. ఒకవైపు చైనా మీదకు మనల్ని ఉసిగొల్పుతున్న అమెరికా మరోవైపు వారితోనే ఏడాదికేడాది లావాదేవీలను ఎందుకు పెంచుకుంటున్నట్లు? అంతకు ముందుతో పోల్చితే 2021లో 28.7 శాతం లావాదేవీలు పెరిగాయి. చైనా మిగులు 39,6500 కోట్ల డాలర్లు. 2018లో వాణిజ్య యుద్ధం ప్రారంభానికి ముందు ఇది 32,300 కోట్ల డాలర్లు మాత్రమే ఉంది. 2021లో తొలిసారిగా చైనా ఆరు లక్షల కోట్ల డాలర్ల వాణిజ్య లావాదేవీల మైలు రాయిని అధిగమించింది. అమెరికా తనను తానే రక్షించుకోలేని స్ధితిలో ఉన్నపుడు మరొక దేశాన్ని రక్షించగలదా? అమెరికా అడ్డగోలుగా ప్రపంచాన్ని నడిపే రోజులు కావివి అని గ్రహించాలి.
/ వ్యాసకర్త సెల్: 8331013288 /
ఎం. కోటేశ్వరరావు











