Jan 03,2021 12:32

   గవర్నమెంట్‌, ప్రైవేట్‌ ఉద్యోగులు పేటర్నిటీ (పితృత్వ) సెలవులు తీసుకోవడం మనకు తెలుసు. కానీ క్రీడారంగంలోని వారు పేటర్నిటీ సెలవులు తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ మన క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పేటర్నిటీ సెలవులు తీసుకోవడం ప్రస్తుతం దేశమంతా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోహ్లీ క్రికెట్‌తోపాటు భార్యపై అమిత ప్రేమను చూపుతూ బాధ్యతగల తండ్రిగా వ్యవహరించడంపౖౖె ప్రశంసల జల్లు కురుస్తోంది.
      హిళలు ప్రసూతి సెలవులు (మెటర్నిటీ) తీసుకుంటుంటారు. అలాగే తండ్రి కూడా 15 రోజులు పెటర్నిటీ సెలవులు తీసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ క్రీడారంగంలోని వారికి పేటర్నిటీ సెలవులు తీసుకోవడం అంటే అంత సులువు కాదు. గతంలో చాలామంది క్రికెటర్లు పెటర్నిటీ సెలవుల కోసం ప్రయత్నించినప్పుడు బిసిసిఐ తిరస్కరించింది. అలాంటివారిలో సునీల్‌ గవాస్కర్‌, ధోనీ, సౌరబ్‌ గంగూలీ ఉన్నారు. గవాస్కర్‌ అయితే తన కుమారుడు పుట్టిన రెండున్నర నెలలకు, ధోనీ కుమార్తె పుట్టిన కొన్నిరోజుల తర్వాత బిడ్డను చూసుకున్నారు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న కోహ్లీ క్రికెట్‌కు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు విమర్శిస్తున్నారు. మరోవైపు సీనియర్‌ క్రికెటర్లు హర్ష్‌బోగ్లే, రవిశాస్త్రి మాత్రం క్రికెట్‌లో కెప్టెనే కీలకం కాదనీ, జట్టు సభ్యుల్లో ఎవరైనా అత్యుత్తమ ప్రతిభ కనబర్చవచ్చనీ చెబుతున్నారు. కోహ్లీ తనకు పుట్టబోయే బిడ్డ కోసం అనుష్కశర్మ చేత దగ్గరుండి ప్రతిరోజూ ఆసనాలు వేయిస్తూ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా కోహ్లీ మూడు టెస్టులు, మూడు టి20లు, నాలుగు టెస్ట్‌ సిరీస్‌లు ఆడాల్సి ఉంది. కానీ పేటర్నిటీ సెలవుల కారణంగా ఒక టెస్ట్‌ సిరీస్‌లో మాత్రమే ఆయన ఆడారు. మరో మూడు టెస్ట్‌ సిరీస్‌లు ఆడకుండానే ఆయన సెలవులు తీసుకున్నారు. సాధారణంగా క్రికెటర్లు పిల్లలు పుట్టినపుడు తన జీవిత భాగస్వామి సంరక్షణ కోసం కొన్నిరోజులు మ్యాచ్‌ను మిస్సవుతుంటారు. నిబంధనలను అనుసరించి వారికి కొన్ని రోజులు మాత్రమే ఈ సెలవులను మంజూరు చేస్తారు. ప్రస్తుతం కోహ్లీ ఇతర క్రీడాకారులకు ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. కోహ్లీలా ఎక్కువకాలం సెలవులు తీసుకున్నవారు లేరు. ఇకమీదట తమకు కోహ్లీలా పేటర్నిటీ సెలవులను పొందవచ్చని మిగతా క్రీడాకారులు భావిస్తున్నారు.

పూర్తి పేరు : విరాట్‌ కోహ్లి
మారుపేరు : యంగ్‌ బ్లూ, డాషింగ్‌ స్టార్‌
పుట్టిన తేదీ : 1988 నవంబరు 5
(వయస్సు: 32 సంవత్సరాలు)
బ్యాటింగ్‌ శైలి : కుడి చేతి వాటం
బౌలింగ్‌ శైలి : రైట్‌ ఆర్మ్‌ మీడియం పేస్‌
భార్య : అనుష్క శర్మ
తండ్రి : ప్రేమ్‌ కోహ్లి, క్రిమినల్‌ లాయర్‌
తల్లి : సరోజ్‌ కోహ్లి, గృహిణి