Feb 02,2022 18:10

న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత 541 ఉగ్ర చర్యల్లో 439 మంది ఉగ్రవాదులు, 109 భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నిత్యానంద్‌ రాయ్ పార్లమెంట్‌లో బుధవారం తెలిపారు. ఆగస్టు 5, 2019లో జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేసి.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి 98 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని, సుమారు 5.3 కోట్ల విలువ చేసే ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయని లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కాగా, ఈ ఘటనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాలేదని చెప్పడం కొసమెరుపు.

1700 మంది జమ్ముకాశ్మీర్‌ పండిట్లు నియామకం
అదేవిధంగా ఆర్టికల్‌ 370 రద్దు అయిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ విభాగాల్లో ఇప్పటి వరకు 1700 కాశ్మీర్‌ పండిట్లను నియమించినట్లు నిత్యానంద రాయ్ తెలిపారు. జమ్ముకాశ్మీర్‌ అందించిన సమాచారం ప్రకారం.. 44,684 కాశ్మీర్‌ వలస కుటుంబాలు..రిలీఫ్‌ అండ్‌ రిహబిలేషన్‌ కమిషనర్‌ (మైగ్రేంట్స్‌) కార్యాలయంలో రిజిస్టర్‌ చేసుకున్నాయని చెప్పారు. వ్యక్తిగతంగా 1,54,712 మంది ఉన్నారని తెలిపారు.