Apr 18,2021 14:29

సినీ పరిశ్రమలో కొందరిని చూస్తే 'అమ్మా' అని పిలవాలనిపిస్తుంది. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు ప్రముఖ సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ. ఆమె అమ్మ పాత్రలో అలా ఒదిగిపోతారు కాబట్టే తనకంటూ అభిమానులను ఏర్పరచుకోగలిగారు. ఈమధ్య ఒక టెలివిజన్‌ ఇంటర్వ్యూకు వచ్చిన ఆమె ఇండిస్టీలో కాస్టింగ్‌ కౌచ్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ తెలియని వారంటూ ఉండరు. ఆమెను చూస్తే మన అమ్మను చూస్తున్నట్లే ఉంటుంది. అంత సహజంగా అమ్మ పాత్రలో ఇమిడిపోతారు. ఈమధ్య ఒక టెలివిజన్‌ షోలో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడారు. నిజానికి కొన్నాళ్ల క్రితం కాస్టింగ్‌ కౌచ్‌ అనే పదం వినబడితే చాలు

సినీ పరిశ్రమ వణికి పోయింది. తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ విపరీతంగా ఉందని శ్రీరెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ''మీటూ'' ఉద్యమమూ తీవ్ర దుమారం రేపింది. నటి మాధవీలత పలు ఇంటర్వ్యూలో అవకాశాలు రావాలంటే కచ్చితంగా కాస్టింగ్‌ కౌచ్‌కు గురికావాల్సిందే అంటూ నిక్కచ్చిగా చెప్పుకొచ్చింది. కాస్టింగ్‌ కౌచ్‌పై ప్రముఖ సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ ఏమి మాట్లాడారంటే..

   కాస్టింగ్‌ కౌచ్‌ అనే పేరు ఇప్పుడు పెట్టారుగానీ ఇది పరిశ్రమలో ఎప్పటి నుంచో ఉంది. నా కెరియర్‌ ప్రారంభంలోనూ మేమూ అనేక చేదు అనుభవాలు ఎదుర్కొన్నాం. 'అప్పట్లోనూ అవకాశాలు ఇవ్వాలంటే వేధించేవారు. ''అవకాశం ఇస్తే మాకేంటి?'' మమ్మల్ని అడిగేవారు. అందుకే 20 ఏళ్లకే పెళ్లి చేసుకోవడం.. పాతికేళ్లకే అమ్మ వేషాలు వేయడం మొదలెట్టాను. హీరోయిన్‌గా ఛాన్సులు వచ్చినప్పటికీ రెండు సినిమాలకే ఆపేశాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా ఎగాదిగా చూడటం, ''అమ్మాయి.. నీవు ఎక్కడ ఉంటావు? నీ ఇల్లెక్కడీ'' అని అడిగేవారు. దాంతో ఇకపై హీరోయిన్‌ పాత్రలు వేయకూడదు అని నిర్ణయించుకున్నా. అమ్మ, అక్క, వదినలాంటి పాత్రలు మాత్రమే ఇవ్వమని పరిశ్రమలో వారికి చెప్పాను. అలా చిన్న వయస్సుల్లోనే తల్లి పాత్రలు చేయడం మొదలెట్టా. అమ్మ వేషాలైతే మన జోలికి ఎవరూ రారు. మాతో తప్పుగా ప్రవర్తించకుండా చూసుకుంటామని మాట ఇస్తేనే నిర్వాహకులకు డేట్స్‌ ఇచ్చేవాళ్లం. పరిశ్రమలో అలాంటివారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. మనమే వారిని తప్పించుకు తిరగాలి' అంటున్నారు అన్నపూర్ణమ్మ.
   'ఇలాంటివి ఉంటాయి కాబట్టే నేనంటూ అవకాశాల కోసం ఎప్పుడూ ఎవరి దగ్గరకు వెళ్లి అడగలేదు. నావరకూ నాకు అవకాశాలు అవే వెతుక్కుంటూ వచ్చేవి. అప్పట్లో పెద్దగా డబ్బు ఇచ్చేవారు కాదు. ఎంత ఇచ్చినా తృప్తిగా ఉండేది. చిన్నతనం నుంచే నాటకాలలో నటించేదాన్ని. మాది విజయవాడ కావడంతో అక్కడ సినిమా షూటింగ్‌లు జరుగుతుండేవి. అలా అప్పట్లోనే చిన్నచిన్న పాత్రలు సినిమాల్లో నటించేదాన్ని. మొదట్లో అవి నాకు పెద్దగా పేరు తేలేదు. కానీ 1975లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ''స్వర్గం నరకం'' సినిమాలో మోహన్‌బాబు సరసన కథానాయకిగా నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాతో గుర్తింపు రావడం మొదలైంది. ఆ సినిమాలోనే ''ఉమ'' అనే నా పేరును ''అన్నపూర్ణ''గా మార్చేశారు. తర్వాత ''ముత్యమంత ముద్దు, సంసారం ఒక చదరంగం, స్వర్గం నరకం, అసెంబ్లీ రౌడీ'' సినిమాల్లో నటించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ఇంకా మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి ''చట్టంతో పోరాటం, రాక్షసుడు, త్రినేత్రుడు, మరణ మృదంగం, దొంగ, సంఘర్షణ, ఖైదీ నెం.786, జ్వాలా''లోనూ నటించాను. ఇప్పటికీ కళారంగంలోకి అడుగుపెట్టి 50 వసంతాలు అయ్యింది' అంటున్నారు అన్నపూర్ణ.
   'అలాగే తప్పు అనేది ఎప్పుడూ ఒకరివైపే ఉండదు. ఇద్దరికీ ఇష్టమైతేనే ఆ తప్పులు జరుగుతాయి. ప్రతీ రంగంలోనూ మహిళలు కాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు, భర్త, కుటుంబ గౌరవాలను దృష్టిలో ఉంచుకుని, మహిళలు వేటికీ లొంగకుండా తప్పించుకు వస్తున్నారు. అదే మాదిరిగా సినీ పరిశ్రమ వాళ్లూ తప్పించుకోవాలి. ఒకవేళ అలాంటి సంఘటనలు ఎదురైతే వెంటనే నోరు విప్పాలి. ఇక అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఇక్కడ కష్టాలు తప్పవు' అని అన్నపూర్ణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎఫ్‌-3' మూవీలో నటిస్తున్నారు. పేరు : అన్నపూర్ణమ్మ

అసలు పేరు : ఉమా మహేశ్వరి (ఉమ)
పుట్టిన తేది : అక్టోబరు 17, 1948
స్వస్థలం : విజయవాడ, కృష్ణా జిల్లా
తండ్రి : ప్రసాదరావు
తల్లి : సీతారావమ్మ