Feb 08,2021 19:13

అసలు పేరు : ఘంటసాల సాయి శ్రీనివాస్‌ థమన్‌ శివకుమార్‌
పుట్టిన తేదీ : 1983, నవంబర్‌ 16
పుట్టిన ప్రాంతం : నెల్లూరు, ఆంధ్రప్రదేశ్‌.
భార్య : శ్రీవర్థిని(ప్లేబ్యాక్‌ సింగర్‌)
తల్లిదండ్రులు : ఘంటసాల శివకుమార్‌, సావిత్రి(ప్లేబ్యాక్‌ సింగర్‌)
నచ్చిన రంగు : తెలుపు, నలుపు
ఇష్టమైన సంగీత దర్శకుడు : ఇళయరాజా


'సినిమా తాలూకు అద్భుతాలు ఒక్కసారిగా సంభవించవు. వాటి వెనుక ఎందరో సృజనకారుల సమిష్టి కృషి ఉంటుంది' అంటున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌. గతేడాది 'అల వైకుంఠపురములో' సినిమా పాటలు తెలుగు సంగీత యవనికపై సరికొత్త చరిత్రను లిఖించారు. అవి యూట్యూబ్‌, సోషల్‌మీడియా వేదికల్లో ఆల్‌టైమ్‌ రికార్డ్స్‌ సృష్టించాయి. అయితే 'ఆ సక్సెస్‌ తాలూకు ఘనతను తనకు మాత్రమే ఆపాదించొద్దని, అందరి శ్రమ ఫలితంగానే అంతటి అపూర్వ విజయం సాధ్యమైంది!' అని వినమ్రంగా తెలిపారు తమన్‌. ఆయన స్వర రచనలో రవితేజ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'క్రాక్‌' ఘన విజయాన్ని దక్కించుకుంది.


ఈయన పాటల్లో ఏది విడుదలైనా వెంటనే 'దీని ఒరిజినల్‌ పాడండ్రా!' అంటూ ట్రోల్‌ మొదలు పెడుతుంటారు. కింగ్‌ సినిమాలో బ్రహ్మానందం మీమ్స్‌ తమన్‌ కోసం కంటే ఎక్కువగా మరెవరికీ వాడుండరు. అంతగా మీమర్స్‌ ఆడుకుంటారు.. పెద్ద హిట్‌ అయిన పాటలను కూడా కాపీ కొట్టాడనే విమర్శలు అందుకున్నాడు. దీనిపై తమన్‌ కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. 'నేను కాపీ కొడుతున్నానని తెలిస్తే.. ఆడియో కంపెనీలు, లిరిక్‌ రైటర్లు, తనతో పనిచేసే వాళ్లంతా ఎలా వింటారు? వాళ్లందరికీ నచ్చే పాట కాపీ అయితే వాళ్లకు తెలివి లేదంటారా?' అంటూ ప్రశ్నిస్తున్నాడు. 'బిజినెస్‌మెన్‌లో 'పిల్లా చావ్‌' పాటతో నాకు వచ్చినంత చెడ్డ పేరు ఇంకెవరికీ వచ్చుండదు. ఆ విమర్శల్ని పట్టించుకొని ఉంటే నేను అక్కడే ఆగిపోయేవాడిని. బిజినెస్‌మేన్‌ తర్వాత 100 సినిమాలకు పైగా సంగీతం అందించాను. వీటిల్లో చాలా వరకూ ఘన విజయాన్ని సాధించాయి!' అని చెప్పారు.
 

రవితేజకు గతంలో మంచి మ్యూజికల్‌ హిట్స్‌ ఇచ్చారు. 'క్రాక్‌' సినిమాకు ఎలాంటి ప్రత్యేకత ఉందనుకుంటున్నారు?
'క్రాక్‌'.. టైటిల్‌ మాదిరిగానే కథా తీవ్రమైన భావోద్వేగాలు, శక్తివంతమైన యాక్షన్‌ సినిమా. కాస్త తిక్క ఉన్న పోలీస్‌ అధికారితో సమరానికి సై అంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నదే సినిమా ఇతివృత్తం. అన్ని వాణిజ్య హంగులు పరిపూర్ణంగా కలబోసిన పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. రవితేజతో మరో అద్భుతమైన ఆల్బమ్‌ చేశాననే సంతృప్తిని కలిగించింది.
 

ఈ సినిమా బాణీల రూపకల్పనలో ఎలాంటి శ్రద్ధ తీసుకున్నారు? 'కోరమీసం పోలీసోడ' వంటి యుగళగీతం, 'భూమి బద్ధలు..' వంటి ఐటెమ్‌సాంగ్‌ శ్రోతల్లో మంచి ఆదరణ సంపాదించుకోవడం ఎలా అనిపిస్తోంది?
భార్యభర్తల మధ్య ఉండే సున్నితమైన అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ 'కోరమీసం పోలీసోడ' అనే పాటకు రూపకల్పన చేశారు. ఆలుమగలు మధ్య రహస్య సంభాషణలు, అవ్యక్తమైన భావాల్ని చూపిస్తూ ఈ పాట సాగుతుంది. పాటలోని భావాలు, దృశ్యాలకు అనుగుణంగా ఎక్కువ వాయిద్యాలు ఉపయోగించకుండా సరళంగా ట్యూన్‌ సిద్ధం చేశాను. ఇక 'భూమి బద్ధలు..' హుషారెత్తించే ఐటెంసాంగ్‌. ఆ పాట మాస్‌బీట్‌తో ఆకట్టుకుంటోంది.
 

ఐటెంసాంగ్స్‌ సంగీత దర్శకులకు ఛాలెంజ్‌ అని చెబుతుంటారు?
మెలోడీ గీతాల్ని ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. సంగీతకారులూ అలాంటి బాణీలనే అందించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అందుకు కారణం ఏమిటంటే.. మెలోడీ అన్నది ప్రేమవంటి గాఢమైన ఉద్వేగం. ప్రతి ఒక్కరు దానితో సహానుభూతి చెందుతారు. ఐటెమ్‌సాంగ్‌ అలా కాదు. మన జీవితానికి ఆవల ఉండే పాట అది. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే అది కిక్‌ని ఇస్తుంది. కొన్ని తరాలుగా సినిమాల్లో ఈ ఐటెమ్‌సాంగ్స్‌ ప్రభావం కనిపిస్తోంది. వాటి వెనకున్న మ్యాజిక్‌ ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కాదు. అయితే ఐటెంసాంగ్స్‌కు ట్యూన్‌ సిద్ధం చేయడమన్నది ప్రతి సంగీత దర్శకుడికి ఛాలెంజ్‌గా అనిపిస్తుంది. మిగతా పాటల కంటే వాటిపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
 

'అల వైకుంఠపురములో' ద్వారా స్వరకర్తగా మీ కెరీర్‌లో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకోవడం ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?
'అల వైకుంఠపురములో' సినిమా విషయంలో అద్భుతాల్ని సృష్టించాలని ముందస్తుగా ప్లాన్‌ చేసుకోలేదు. 'మా అల్బమ్‌ రెండొందల మిలియన్ల వ్యూస్‌ సాధించాలి' అనే లక్ష్యాన్ని పెట్టుకోలేదు. సినిమా బందమంతా కష్టపడి పనిచేశాం. మా శ్రమకు తగినట్లు గొప్ప ప్రతిఫలం లభించింది. దర్శకుడు త్రివిక్రమ్‌ మొదలుకొని గీత రచయితలు, నత్య నిర్ధేశకులు, కళా దర్శకుడు, ఛాయాగ్రాహకుడు.. ఇలా ప్రతి విభాగం చక్కటి సమన్వయంతో ఉత్తమమైన పనితీరును కనబరచడంతో ఆ సినిమా పాటలు తిరుగులేని ఆదరణ సంపాదించుకున్నాయి. ఆ విజయం తాలూకు ఘనత హీరో బన్నీ, దర్శకుడు త్రివిక్రమ్‌కే చెందుతుంది. త్రివిక్రమ్‌ సృజనాత్మకత, బన్నీ పెర్ఫార్మెన్స్‌ లెవల్స్‌తో ఆ పాటలు అంత పాపులర్‌ అయ్యాయి. 'అల వైకుంఠపురములో' ఆల్బమ్‌ చరిత్ర సృష్టించినప్పటికీ ఆ క్రెడిట్‌ నేనొక్కడినే అస్సలు తీసుకోను.


ప్రస్తుతం మీ చేతిలో అరడజనుకుపైగా అగ్రహీరోల చిత్రాలున్నాయి. వీటన్నింటికీ బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇవ్వడానికి మీరు ఎలాంటి కసరత్తులు చేస్తుంటారు?
నా కలల్ని సాఫల్యం చేసుకుంటూ సంగీత దర్శకుడిగా ప్రయాణం సాగిస్తున్నా. కాలేజీ రోజుల్లోనే చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ వంటి ప్రతిభావంతులతో కలిసి పనిచేయాలనే కోరిక ఉండేది. నా వృత్తిని ఎప్పుడూ వాణిజ్యకోణంలో చూడలేదు. త్రివిక్రమ్‌ అనే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అందుకోవడానికి నాకు వంద సినిమాలు పట్టింది. ఆయనతో కలిసి రెండు చిత్రాలకు పనిచేయడంతో నా కల నెరవేరినట్లయింది. ఈ రోజు నేను పెద్ద సినిమాలు చేస్తున్నానంటే అది నా కష్టానికి, తపనకు ఫలితం అనుకుంటున్నా.