మువ్వన్నెల జాతీయ పతాక ముద్రతో దాదాపు ఏడు దశాబ్దాల పాటు గగన విహారం చేసిన ఎయిర్ ఇండియాపై ఇక ఆ ముద్ర చెరిగిపోతుంది. ప్రభుత్వ రంగంలో పౌర విమానయానం లేని అతి తక్కువ దేశాల జాబితాలో భారత్ చేరిపోయింది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పదేపదే ఉద్ఘాటించే 'దేశం ముందు' (నేషన్ ఫస్ట్) వంటి నినాదాల వెనుక జాతి సంపదను కార్పొరేట్ కంపెనీలకు కారుచౌకగా దోచిపెట్టే కుట్రలకు ఎయిర్ ఇండియా లాంటి సుసంపన్నమైన జాతి సంపద బలైపోతోంది. టాటాల నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి టాటాలకి ఎయిర్ ఇండియా మారడం ఇదే తొలిసారి కాదు. యాజమాన్యపు హక్కులు చేతులు మారిన ప్రతిసారీ లబ్ధి పొందింది మాత్రం టాటాలే.
దేశంలోనే తొలిసారి పైలట్ అనుమతి పొందిన జెఆర్‌డి టాటానే 1932లో టాటా ఎయిర్ సర్వీసెస్ పేరుతో విమానయాన సంస్థ ప్రారంభించారు. అప్పుడు ఆయన పెట్టిన పెట్టుబడి రూ.2 లక్షలు. కాగా ఐదేళ్లలోనే తన లాభాలను రూ.6 లక్షలకు పెంచుకోగలిగింది. 1938లో టాటా ఎయిర్‌లైన్స్‌గా పేరు మార్చారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాటి బ్రిటీష్ ప్రభుత్వం టాటాల నుంచి విమానాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం, ఆ తర్వాత విభేదాలు రావడంతో తిరిగి టాటాలకే అప్పగించారు. స్వాతంత్య్రోద్యమ సెంటిమెంట్ నేపథ్యంలో 1946లో టాటా ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్ ఇండియాగా పేరు మార్చి జాయింట్ స్టాక్ కంపెనీగా పబ్లిక్ లోకి వచ్చింది. యుద్ధ పరిణామాలు, బ్రిటీష్ ప్రభుత్వ వేధింపుల నేపథ్యంలో లాభాలు తగ్గుముఖం పడుతుండటాన్ని గ్రహించిన టాటాలు ఆ భారాన్ని స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైకి నెట్టేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వానికి 49 శాతం వాటాను టాటాలు ప్రతిపాదించినదే తడువుగా నాటి నెహ్రూ ప్రభుత్వం తలూపేసింది. అయినా నష్టాలు క్రమేపి పెరిగిపోతుండటంతో మొత్తం విమానయాన సంస్థను వదిలించుకోవడానికి టాటాలు యత్నించారు. ప్రభుత్వం టాటాలకు ఆనాడే రూ.2.8 కోట్లు భారీ మొత్తం కట్టబెట్టి ఎయిర్‌ఇండియాను జాతికి అంకితం చేశారు. నాటి నష్టాల ఎయిర్ ఇండియాను సంస్థాగతంగా అభివృద్ధి చేసి 'మహారాజా' దర్పంతో కోట్లాది రూపాయల ఆస్తులతో జాతి సంపదగా తీర్చిదిద్దినది దేశ ప్రజల పన్నులతోనే! ఆ నాడు నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రభుత్వానికి అప్పజెప్పి చేతులు దులిపేసుకున్న అదే టాటా గ్రూపు ఇప్పుడు నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ఉద్ధరిస్తామని చెప్పడం, అదే విషయాన్ని మోడీ సర్కార్ బాకాలూది ప్రజలను వంచించడం కార్పొరేట్ దోపిడి నైజానికి నిదర్శనం. నష్టాల బూచిని తెరపైకి తీసుకొచ్చి వేలాది కోట్ల రూపాయల విలువ చేసే స్థిర, చరాస్తులతో సహా ఎయిర్ ఇండియా ఇప్పుడు మళ్లీ టాటాల వశమైంది. ఇది అధికారిక దోపిడి.
1990లలో దేశంలోకి ఉప్పెనలా వచ్చిపడ్డ నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణల వల్ల అన్ని రంగాల మాదిరే ప్రభుత్వ పౌర విమానయాన రంగం కూడా దెబ్బతింది. ప్రయివేటు కంపెనీలకు ఎర్ర తివాచీ పరిచి భారీ రాయితీలు కుమ్మరించడంతో ఎయిరిండియా చతికిలపడుతూ వచ్చింది. కార్పొరేట్ అనుకూల ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణం. ప్రవాస భారతీయులు అధికంగా ఉండే సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ తదితర దేశాలకు కార్పొరేట్ విమానయాన సర్వీసులకు అనుమతించి గత కాంగ్రెస్ ప్రభుత్వం లాభదాయక మార్గాలను ప్రయివేటీకరిస్తే ఇప్పటి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఏకంగా మొత్తం విమానయాన సంస్థేనే టాటాలకు కారుచౌకగా కట్టబెట్టి ఉరితీసేసింది. బంగారు గుడ్లు పెట్టే బాతుల్లాంటి ప్రభుత్వ సంస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా క్రోనీ కార్పొరేట్ మిత్రులకు పప్పుబెల్లాలు పంచిపెట్టేస్తున్న మోడీ సర్కార్ ఎన్నికల బాండ్ల ద్వారా దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బిజెపిని సుసంపన్నం చేసుకుంది. పోర్టులు, రైల్వేలు, విమానాశ్రయాలు, బ్యాంకులు, ఎల్‌ఐసి ప్రతి సంస్థనూ కార్పొరేట్‌కు బలి పెట్టేస్తున్నారు. తెలుగు ప్రజలు ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుపైనా కార్పొరేట్ కత్తిని వేలాడదీసింది. కార్మిక సంఘాల ఐక్యతా పోరాటాలతో ఇప్పటి వరకూ కాపాడుకుంటూ వస్తున్న విశాఖ ఉక్కును ఏమాత్రం ఏమరపాటు వహించినా కార్పొరేట్ గద్దలు తన్నుకుపోతాయి. చీకటి చట్టాలపై విజయపతాక ఎగురవేసిన రైతన్నల పోరాట స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలు సాగించి ప్రజల సంపదను ప్రభుత్వ రంగంలోనే కాపాడుకోవాలి.










