ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : మండలంలోని మారుమూల ప్రాంతమైన కేసరి, వంగర నుంచి గుమ్మలక్ష్మీపురం వైపు వస్తున్న పార్వతీపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వంగర గ్రామం నుంచి తిరుగు ప్రయాణంలో ఘాటీ దిగుతుండగా మలుపు వద్ద అదుపు తప్పింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 22మంది ప్రయాణికులు ప్రాణాపాయంతో సురక్షితంగా బయటపడ్డారు. కేదారిపురం, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులు ఉన్నారు. ఆర్‌టిసి బస్సు అదుపుతప్పిన సమీపాన సుమారు ఇరవై అడుగుల వరకు లోయ ఉంది. ఘాట్ రోడ్డు సమీపాన నిర్మించిన రక్షణ గోడలు అక్కడ అక్కడ శిథిలమయ్యాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ రహదారిపై ప్రయాణం ప్రాణాపాయంగా మారుతుంది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్డు సగభాగం కుంగిపోయింది. స్పందించిన అధికారులు మరమ్మతులు చేయించారు. అయితే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టి వాహన రాకపోకలకు వీలు కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.










