Feb 04,2022 21:43
  • ఎంబివికె ఆన్‌లైన్‌ ప్రసంగం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : కేంద్ర బడ్జెట్‌ ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక, అభివృద్ధి నిరోధక బడ్జెట్‌ అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్పారు. కరోనా విలయంతో ఆదాయాలు కోల్పోయిన ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కల్పన ద్వారా కొనుగోలు శక్తి కల్పించి గిరాకీ పెంచే చర్యలేవీ బడ్జెట్‌లో లేవన్నారు. కార్పొరేట్లకు అదనపు రాయితీలిచ్చి వారి ఆదాయాలు పెంచే వ్యవహారాలు బడ్జెట్‌లో పుష్కలంగా ఉన్నాయని వివరించారు. మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె) శుక్రవారం 'కేంద్ర బడ్జెట్‌పై విశ్లేషణ' ఆన్‌లైన్‌ ప్రసంగం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎంబివికె కార్యదర్శి పి మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. రాఘవులు ప్రసంగిస్తూ అప్పులు చేసి కార్పొరేట్లకు దోచి పెట్టేందుకు సిద్ధపడ్డ ప్రభుత్వం, ప్రజలకు ఉపయోగపడే రంగాలైన వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఆహార సబ్సిడీ, విద్య, వైద్యాలకు నిధుల కేటాయింపులు తగ్గించిందన్నారు. అప్పులు చేయకుండా కార్పొరేట్లపై పన్నులేసి ఆదాయం సమకూర్చుకొనే అవకాశం ఉన్నా ఆ పని చేయట్లేదు. పైగా కార్పొరేట్‌ పన్నును 15 శాతానికి తగ్గించింది. రూ.5 లక్షల కోట్ల పెట్టుబడి సమకూర్చే ఏర్పాటు చేసింది. బడా కాంట్రాక్టర్లు బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వనవసరం లేదంది. కార్పొరేట్లకు ఇలాంటి ఎన్నో వెసులుబాట్లు, రాయితీలు బడ్జెట్‌లో ఉన్నాయి. మౌలిక సదుపాయాల రంగంలో 'పిఎం గతిశక్తి' పేరిట గతం కంటే రూ.రెండు లక్షల కోట్లు అధికంగా 7.5 లక్షల కోట్లు ఆస్తుల సృష్టికి ఖర్చు చేస్తామంటున్నారు. రోడ్లు ఎప్పుడు ఎక్కడ వేస్తారో, వందే భారత్‌ రైళ్లు ఎప్పటికి నడుపుతారో చెప్పలేదు. రక్షణరంగంలో 68 శాతం ప్రైవేటు అంటున్నారు. ఇవన్నీ ప్రజల ఆదాయాలు పెంచవు. ప్రభుత్వరంగంలో కాకుండా ప్రైవేటు రంగానికి నిధులు చేరితే కొత్త ఉద్యోగాలు రావు.
అన్నింటికీ కోతలే
వ్యవసాయానికి నిధులు తగ్గించారని రాఘవులు చెప్పారు. ఎరువుల సబ్సిడీ రూ.1.40 లక్షల కోట్ల నుండి 1.05 కోట్లకు తగ్గింది. ఉపాధి హామీకి రూ.98 వేల కోట్ల నుండి 73 వేల కోట్లకు తగ్గింది. ఎఫ్‌సిఐకి రూ.2.60 లక్షల కోట్ల నుండి 2.06 కోట్లకు కోత పడింది. పిడిఎస్‌కు 60 వేల కోట్లు తగ్గింది. విద్య, ఆరోగ్య రంగానికి ద్రవ్యోల్బణంతో పోల్చుకుంటే తక్కువ కేటాయింపులు చేశారు. నిధుల తగ్గింపు ఆయా రంగాలను పతనం కావిస్తాయి. వ్యవసాయంలో డ్రోన్లు, స్టార్టప్‌ల వంటివి అగ్రి బిజినెస్‌ చేసే కార్పొరేట్ల ప్రవేశానికి పనికొస్తాయి. అననుకూల పరిస్థితుల్లో బ్యాంకులు, ఎడ్యుకేషన్‌, అగ్రి డిజిటలైజేషన్‌ కార్పొరేట్లకే లాభిస్తుంది. ఉన్న ఉద్యోగాలు కుదించుకుపోతాయి. ఇప్పటికే ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.
రాష్ట్రాల్లోకి చొరబాటు
గతంలో రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా ఇచ్చే రూ.లక్ష కోట్ల మేర పన్నుల్లో వాటా, గ్రాంట్లను తీసేసిందని రాఘవులు చెప్పారు. వడ్డీ లేని రుణంగా ఇస్తామంటోంది. అదీ ఏదైనా ప్రాజెక్టు చేస్తామని ప్రతిపాదనలు పంపాలంది. ఈ చర్య ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బతీసేది. రాష్ట్రాలకు అన్యాయం చేసేది. జిడిపిలో కేంద్రం 6.4 శాతం వరకు అప్పులు చేయొచ్చుకాని, రాష్ట్రాలు మాత్రం 3.5 శాతమే చేయాలని ద్వద్వనీతి అమలు చేస్తోంది. మరో అర శాతం అప్పు చేయాలంటే విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయాలని షరతులు పెట్టడం దుర్మార్గం. రాష్ట్రాల చేతుల్లో ఉండే ప్రజలకు ఉపయోగపడే స్కీంలను కాదని కేంద్రమే స్కీములు ప్రకటిస్తోంది. రాష్ట్రాలకు కేంద్ర వాటా ఇవ్వట్లేదు. ఒకే దేశాంఒకే రిజిస్ట్రేషన్‌ అనేది రాష్ట్రాల హక్కుల్లోకి చొరబడటమే. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలుపై కేంద్రం మొండి చెయ్యి చూపింది. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మాట్లాడలేదు. వారి ఎంపిలు మాట్లాడినా పెద్దగా ఉపయోగం లేదు. చంద్రబాబు నంగి నంగి మాట్లాడుతున్నారు. వీరిద్దరి వైఖరి వలన రాష్ట్రం నష్టపోతోంది.. అని రాఘవులు అన్నారు.