- నాలుగు మాసాల్లో ప్రోగ్రెస్ నిల్
- పోలవరంపై కేంద్రం తాజా సమాచారం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం ద్వారా జాతీయ ప్రాజెక్టు హోదా పొందిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం మరోసారి అధికారికంగా బహిర్గతమైంది. నిర్వాసితులకు భూసేకరణ, సహాయ పునరావాసం (ఆర్ అండ్ ఆర్) విషయంలో సాచివేత తాజాగా సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద వెల్లడైన వివరాలతో రూఢి అయింది. హైదరాబాద్‌లోని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ (కృష్ణా గోదావరి భవన్) విభాగం ఈ నెల 13న పోలవరం స్థితిని తెలిపింది. భూసేకరణకు రూ.11,976.77 కోట్లు కావాలని అంచనా వేశారు. ఇప్పటికి భూసేకరణలో ప్రగతి 67.43 శాతం మాత్రమే. ఇంకా 54,257 ఎకరాలు సేకరించాలి. ఆర్ అండ్ ఆర్ విషయానికొస్తే ఈ కాంపొనెంట్‌కు రూ.23,674.77 కోట్లు అవసరమవుతాయన్నారు. ప్రాజెక్టుతో ముంపునకు గురవుతున్న కుటుంబాల్లో ఇప్పటికి కేవలం 11.02 శాతం కుటుంబాలనే తరలించారు. ఆర్ అండ్ ఆర్‌లో భాగమైన ఇళ్లు, మరుగుదొడ్లు, బ్రిడ్జిలు, డ్రైన్లు, రోడ్ల నిర్మాణాల ప్రగతి అధోగతిలో ఉంది. భూసేకరణ, సహాయ పునరావాసం ప్రోగ్రెస్ గడచిన నాలుగు మాసాల్లో పేలవంగా ఉంది. కొన్ని పనులు అసలు మొదలు కాలేదు. ఇదే సమయంలో ప్రాజెక్టు హెడ్‌వర్క్స్, కుడి ప్రధాన కాల్వ, ఎడమ ప్రధాన కాల్వ నిర్మాణాలకు ప్యాకేజీల వంతున కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. వాటి విలువ రూ.11,784.24 కోట్లు. ఇప్పటికి ఎర్త్ వర్క్ 87.67 శాతం, కాంక్రీట్ పనులు 81.14 శాతం, స్ట్రక్చర్స్ 69.83 శాతం పూర్తయ్యాయి. కాంక్రీట్ అప్రోచ్ ఎగ్జిట్ ఛానల్ ప్రగతి సున్నాగా ఉంది. కేంద్ర జల వనరుల విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినతుల మేరకు చేసిన పనులకుగాను కేంద్ర ఆర్థిక శాఖ 2019-23 మధ్య రూ.7,654.23 కోట్లు రీయింబర్స్ చేసింది. ప్రాజెక్టు ఆలస్యం కావడానికి పేర్కొన్న కారణాల్లో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ జాప్యాన్ని రెండవ కారణంగా జలశక్తి మంత్రిత్వ శాఖ పేర్కొంది. పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పటికీ 2024 మార్చి నాటికి ప్రధాన జలాశయం, జూన్ చివరాఖరికి డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణాలు పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వాలన్నది తాజా డెడ్‌లైన్‌గా తెలిపింది. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్‌లను ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలని గడువు విధించామని వెల్లడించింది.












