ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : పోలవరం ముంపు మండలాల్లో అభివృద్ధి అటకెక్కింది. శిలాఫలకాలు తప్ప గ్రామాల్లో ఎటువంటి పనుల జాడా కానరావడం లేదు. మౌలిక వసతుల కల్పనలోనూ పాలకులు మొండిచేయి చూపుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక, కూనవరం, విఆర్.పురం, చింతూరు మండలాల్లో 375 గ్రామాల్లో మూడు లక్షలకుపైగా జనాభా నివసిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో ప్రతిపక్ష నేతగా వైఎస్.జగన్మోహన్‌రెడ్డి పర్యటించి వరాల జల్లు కురిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. అప్పటికి ఉన్న వసతులు, సౌకర్యాలకు సైతం కోత పెట్టారు. 45.72 కాంటూరు పరిధిలో ఉన్న గ్రామాల్లో సైతం అభివృద్ధి పనులు జరగడం లేదు. గతేడాది వచ్చిన వరదల కారణంగా రహదారులు ఛిద్రమయ్యాయి. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు రోజుల తరబడి నీటిలో ఉండడంతో మరింత ప్రమాదకర స్థాయికి చేరాయి. పలు పాఠశాలల భవనాలు సైతం విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళన కలిగించే విధంగా మారాయి. ఈ పరిస్థితుల్లో రహదారులకు మరమ్మతులు చేయడం, ఇప్పటికే ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం వంటి బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది. పంచాయతీలలో నిధులు లేవంటూ బోర్లుకు సైతం మరమ్మతులు చేయడం లేదు. దీంతో, వందలాది గ్రామాల్లో తాగునీటి సమస్య వెంటాడుతోంది.
- ముందుకు కదలని పనులు
విఆర్ పురంలో పెద్దమట్టపల్లి నుంచి నర్సింగపేటకు 25 కిలోమీటర్ల బిటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. దీనికి కోటి రూపాయల ఖర్చు చేస్తామని అధికారులు ప్రకటించారు. అదే మండలంలో తెల్లంవారి గూడెం నుంచి గుండేటి వాడకు రూ.50 లక్షలతో ఐదు కిలోమీటర్ల బిటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. రోడ్లు వేసేందుకు పాత రోడ్డును తవ్వి చిప్స్ వేశారు. ఇప్పటికీ ఈ రోడ్లు వేయలేదు. పెద్ద మట్టపల్లి నుంచి ఒరివాడ బిటి రోడ్డుకు శంకుస్థాపన చేసినా పనులు జరగలేదు. రేఖపల్లిలో కస్తూర్బా పాఠశాలలో 200 మంది విద్యార్థులు ఉన్నారు. శిథిలావస్థలో ఉన్న ఆ స్కూలుకు ప్రత్యామ్నాయంగా రూ.26 లక్షలతో భవనం నిర్మిస్తామని శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ నూతన భవనం పూర్తి కాలేదు. విఆర్ పురం పిహెచ్‌సి పాత భవనంలో కొనసాగుతోంది. కొత్త భవనం నిర్మాణానికి సుమారు రూ.30 లక్షలతో చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో, శిథిల దశలో ఉన్న భవనంలోనే అక్కడి వైద్యులు రోగులకు సేవలందిస్తున్నారు. ఇటీవల భవనం పెచ్చులూడి పడిపోయిందని, ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నామని ఎఫ్‌ఎన్‌ఒ వినీత తెలిపారు.
- తాగునీటికీ తప్పని అవస్థ
చింతూరు మండలంలో 117, విఆర్.పురంలో 72, ఎటపాకలో 130, కూనవరంలో 56 గ్రామాలు మొత్తం 375 గ్రామాలు ఉన్నాయి. చింతూరు మండలంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. బోర్లు రిపేర్లు కూడా సకాలంలో చేయడం లేదు. సిపిఎం ప్రజాప్రతినిధులు ఉన్న చోట చొరవ తీసుకొని తాగునీటి సమస్యను పరిష్కరిస్తున్నారు. ఎటపాక మండలంలో తోటపల్లి, నెల్లిపాక, గౌరిదేవిపేట తదితర 28 గ్రామాల్లో, కూనవరం మండలంలో 20 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. పంచాయతీలలో నిధులు లేకపోవడంతో బోర్లు మరమ్మతు ఆలస్యమవుతోందని అక్కడి పంచాయతీ అధికారులు చెబుతున్నారు.
- పాదయాత్ర బృందాలకు సమస్యల ఏకరువు
పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన పోరుకేక పాదయాత్రకు గ్రామాల్లో అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు. ఆయా గ్రామాల ప్రజలు పాదయాత్ర బృందాల వద్ద తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
- యూత్ ప్యాకేజీ ఇవ్వలేదు : ముచ్చక విజయవర్థన్, చేగొండపల్లి పునరావాస కాలనీ, పోలవరం
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ యూత్ ప్యాకేజీ ఇస్తామన్నారు. ఇప్పటి వరకూ ఇవ్వలేదు. దీనిపై అధికారులను అడిగితే జాబితాలో పేరు లేదన్నారు. కారణమేంటంటే మాకు తెలియదని చెప్తున్నారు. ఏదైనా పని చేసుకుందామంటే పని లేదు. ఎట్లా బతికాలి
- ఉపాధి కోల్పోయాం : మిడియం వెంకాయమ్మ, చేగొండపల్లి పునరావాస కాలనీ, పోలవరం
ఆరెకరాల పోడు భూముల్లో జీడి గింజలు ఏరుకుని జీవనోపాధి పొందేవారం. పోలవరం ప్రాజెక్టు పేరుతో ఆరు ఎకరాల భూమిని తీసుకున్నారు. నష్టపరిహారం, భూమికి భూమి ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
- తాగు నీటి సమస్య ఎక్కువగా ఉంది : కోట్ల చంద్రకళ, పోరెడ్డిగూడెం, జీలుగుమిల్లి మండలం
ఇక్కడ నీటి సమస్య ఎక్కువగా ఉంది. మౌలిక వసతులు లేవు. దాహార్తి తీర్చుకోవడానికి అన్ని కాలాల్లోనూ తిప్పలు తప్పడం లేదు. తాగునీటి కోసం దూరంగా వెళ్లాల్సి వస్తోంది.
- పరిహారం అందలేదు కనుగుల సుబ్బలక్ష్మి, పోరెడ్డిగూడెం, జీలుగుమిల్లి మండలం
ఇక్కడ సంవత్సరం నుంచి ఉంటున్నా కనీస సదుపాయాలు కల్పించ లేదు. మా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇద్దరు పిల్లలున్నా పరిహారం ఇప్పటికీ అందలేదు.
- గొంతెండుతోంది : సున్నం అశ్రిత, ముకునూరు, చింతూరు మండలం
మా గ్రామంలో 170 కుటుంబాలు ఉన్నాయి. సుమారు 500కుపైగా జనాభా ఉంది. తాగునీటి సౌకర్యం లేదు. కిలోమీటరు దూరంలోని సోకులేరు వాగు నుంచి ప్రతి రోజూ మూడు బిందెల నీళ్లు మోసుకుని ఇంటికి తెస్తున్నాను. గత్యంతరంలోని పరిస్థితుల్లో గ్రామంలోని అందరం ఈ వాగు నీటినే తాగడానికి వినియోగిస్తున్నాం. ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి.
- గ్రావెల్ రోడ్లు వేయాలని కోరినా మంజూరు చేయలేదు : జల్లి లావణ్య, ఎంపిటిసి సభ్యులు, ఎజి కోడేరు, చింతూరు మండలం
గతేడాది వచ్చిన గోదావరి వరదలకు గ్రామంలో రోడ్లు పూర్తిగా ఛిద్రమయ్యాయి. రోడ్లు మరమ్మతులు చేయాలని అధికారులను కోరినా సమస్యను పరిష్కరించలేదు. జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందిస్తామని చెప్పారు. పైప్‌లైన్‌లు వేశారుగానీ ఇప్పటికీ కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో, గ్రామంలోని ప్రజలు బోరు నీరే తాగుతున్నారు. ఈ ప్రాంతం అధికారుల రికార్డుల ప్రకారం 45.72 కాంటూరు పరిధిలో ఉందని అధికారులు చెప్తున్నా అభివృద్ధి పనులు చేయడం లేదు.










