బీజింగ్ : 2022 చివరి నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి)మొత్తం సభ్యత్వం 9 కోట్ల80లక్షల 41వేలకు చేరింది. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 1.4 శాతం పెరుగుదల ఉంది. సిపిసి 102వ వ్యవస్థాపక వార్షికోత్సవం(జులై1) సందర్భంగా పార్టీ నిర్మాణ వ్యవహారాల విభాగం తాజాగా ఈ వివరాలను వెల్లడించింది. సిపిసి ప్రాథమిక యూనిట్లు గత సంవత్సరం ఆఖరునాటికి 50,06,500 ఉన్నాయి. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 1,29,000 యూనిట్లు పెరిగాయి పార్టీ నిర్మాణ వ్యవస్థ పటిష్టవంతమైందని, పార్టీ గవర్నెన్స్ మూలాలు దృఢంగానే ఉన్నాయని నిర్మాణ విభాగం తెలిపింది. 2022లో దాదాపు 24 లక్షల 50 వేల మంది కొత్తగా పార్టీలో చేరినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయిదేళ్లకు ఒక సారి జరిగే సిపిసి మహాసభ గత ఏడాది జరిగిన సంగతి తెలిసిందే. 2022 చివరి నాటికి పార్టీ మొత్తం సభ్యత్వంలో మహిళా సభ్యుల సంఖ్య 2కోట్ల 93 లక్షలకు చేరింది. అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 0.5 శాతం పెరుగుదల ఉంది. పార్టీలో మైనార్టీ తెగల ప్రాతినిధ్యం ఈ కాలంలో 0.1 శాతం నుంచి 7.6 శాతానికి పెరిగినట్లు ఆ డేటా తెలియజేస్తోంది. అలాగే సిపిసి సభ్యుల్లో అత్యధికులు పార్టీ పునాది వర్గాలైన కార్మిక కర్షక కుటుంబాల నుంచి వచ్చినవారే ఉన్నారు. మొత్తం సభ్యుల్లో వీరు 33.3 శాతంగా ఉన్నట్టు సిపిసి డేటా తెలిపింది.










