Jun 23,2023 10:49
  • నిర్వాసితులకు అండగా ఉంటాం : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
  • గామగ్రామానా 'పోలవరం పోరుకేక' పోలవరం ముంపు ప్రాంతాల్లో మూడో రోజు కొనసాగిన పాదయాత్ర

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి, కూనవరం, విఆర్‌.పురం : పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన పోలవరం పోరుకేక పాదయాత్ర మూడో రోజైన గురువారమూ ఉత్సాహంగా సాగింది. కొండ్రాజుపేట నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పూసుగూడెం, ఆర్కూరు, రేపాక, భగవాన్‌పురం, మూల్లూరు మీదుగా కూటూరు వరకూ సాగింది. యాత్ర అగ్రభాగాన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ తదితరులు ఉన్నారు. వందలాది మంది నిర్వాసితులు వారివెంట ఎర్రజెండాలు చేతబూని ముందుకు సాగారు. తమను మోసం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
          కొండ్రాజుపేట వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్రకు జనం హారతులు పట్టారు. ప్రతి ఇంటినీ పలకరిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఈ యాత్ర సాగింది. నిర్వాసితుల్లో చైతన్యం రేకెత్తించింది. ఆర్కూర్‌ సచివాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో వి.శ్రీనివాసరావు, బి.వెంకట్‌ మాట్లాడారు. సిపిఎం ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన పోరాటాలను వివరించారు.

Lets-not-sit-still-if-the-rights-expire


                                                                   ఆకట్టుకున్న కళారూపాలు

యాత్ర పొడవునా ప్రజానాట్యమండలి కళాకారుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 'గోదారమ్మ నీటిమువ్వలం, రేలా పాటల పూల కొమ్మలం, మమ్మల్ని ముంచక చూస్తే పదును ఈటెలం' అంటూ కళాకారులు, నిర్వాసితులు పాలక ప్రభుత్వాలను హెచ్చరిస్తూ గీతాలు ఆలపించారు. ఇవి జనంలో ఉత్తేజం రేకెత్తించాయి. పోరాటకాంక్షను రగిలించాయి.
 

                                                                           విశేష మద్దతు

కొండ్రాజుపేటలో ప్రారంభమైన పాదయాత్రకు మాజీ ఎంపీ సోడి రామయ్య, మాజీ జెడ్‌పిటిసి కన్యక పరమేశ్వరి, మాజీ ఎంపిపి పోడియం అప్పారావు తదితరులు మద్దతు తెలిపారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ సాగుతున్న ఈ యాత్రలో పార్టీలకు అతీతంగా అందరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. మరికొద్ది దూరం వెళ్లేసరికి యాత్ర బృందానికి సిఐటియు కార్యకర్తలు, వ్యవసాయ కూలీలు ఎదురేగి స్వాగతం పలికారు. ఆదివాసీ యువత సంప్రదాయ విల్లంబులు ధరించి యాత్రలోనడిచారు. పాదయాత్ర రేపాక సెంటర్‌కు చేరుకోగానే ఆ గ్రామంలోని మహిళలు పూల మాలలతో స్వాగతం పలికారు. ఎండకు సైతం వెరవక తలపై నీళ్లబాటిళ్లతో కదులుతూ.. దాహార్తిని తీసుకుంటూ పోలవరం నిర్వాసితులు పాదయాత్ర చేస్తున్న తీరు వారి పట్టుదలకు దర్పణంగా నిలిచింది. యాత్రలో సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌, మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, ప్రజాప్రతినిధులు ప్రదీప్‌ కుమార్‌, పులి సంతోష్‌ కుమార్‌, కొమరం పెంటయ్య, వెంకమ్మ, నాగమణి, అమ్మాజీ, కారం లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య సతీమణి సుక్కమ్మ, మాజీ ఎంపిపి సభ్యులు సున్నం నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Lets-not-sit-still-if-the-rights-expire

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి, కూనవరం, విఆర్‌.పురం : 'పోలవరం ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు సహా సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితుల హక్కులను కాలరాస్తే ఊరుకోం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేయాలని చూస్తే ఆదివాసీలు మూడో కన్ను తెరవడం ఖాయం' అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పోలవరం పోరుకేక మహా పాదయాత్ర గురువారం కూనవరం మండలంలోని కొండ్రాజుపేట, ఆర్కూరు, రేపాక సహా పలు గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఆర్కూరు సచివాలయం, రేపాక సెంటర్లలో సమావేశాలు జరిగాయి. ఆర్కూరులో నిర్వహించిన సమావేశంలో బి.వెంకట్‌ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు చేపట్టిన ఈ మహా పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. కూనవరం, విఆర్‌.పురం మండలాల్లో ప్రజలు ప్రలోభా లకు సైతం నెరవకుండా ఎర్రజెండా అభ్యర్థులను గెలిపించుకున్నారని అభినందిం చారు. మాజీ ఎమ్మెల్యేలు కుంజా బొజ్జి, సున్నం రాజయ్య, మాజీ ఎంపిపి కారం శిరమయ్య అందించిన సేవలను గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రతి పాదించినప్పుడే పోలవరం నిర్వాసితుల పక్షాన నికరంగా నిలిచి పోరాడారని అన్నారు.
          మునిగిపోయే గ్రామాల ప్రజలను ఆదుకుంటామని అసెంబ్లీ సాక్షిగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిందని విమర్శించారు. ప్రజలను ఆదుకుంటామని 2019 ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో పర్యటించిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించారన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు గత టిడిపి, ప్రస్తుత వైసిపి పోటీ పడ్డాయన్నారు. ఎకరా భూమికి కేవలం రూ.లక్షా 15 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, అధికారంలోకి వస్తే రూ. ఐదు లక్షలు ఇస్తామంటూ ఇచ్చిన హామీని సిఎం జగన్‌ బుట్ట దాఖలు చేశారని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు అందజేసే పరిహారం, పునరావాసం భిక్షకాదని వారి హక్కని అన్నారు. ఈ సమావేశానికి విఆర్‌.పురం ఎంపిటిసి సభ్యులు పూణెం ప్రదీప్‌కుమార్‌ అధ్యక్షత వహించారు.
 

                                                         కాంటూరు లెక్కలు కాకి లెక్కలు : వి. శ్రీనివాసరావు

పరిహారం చెల్లింపునకు దశలవారీ పేరుతో మభ్యపెట్టారని, కాంటూరు లెక్కలు కాకి లెక్కలని గత ఏడాది వచ్చిన వరదలు తేల్చేశాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. రేపాక సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పోలవరం నిర్వాసితులు చేపట్టిన ఈ మహా పాదయాత్ర జూలై 4 వరకూ కొనసాగుతుందని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే పాలకుల సంగతి తేల్చేందుకు నిర్వాసితులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పునరావాసం, పరిహారం కల్పించాకే తమ ఊరిలోకి అడుగు పెట్టాలని హెచ్చరిస్తూ ప్రతి ఊరి ముందూ గ్రామ ప్రజలు బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. పెద్ద ఆర్కూరు, రేపాకలలో అర్హులను సైతం జాబితాలో చేర్చలేదన్నారు. నిర్వాసితుల కోసం జరిగే ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. దళితులు, ముస్లిములు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీల హక్కులను కాలరాస్తోన్న బిజెపితో చెలిమి చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎవరిని ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. పట్టిసీమలో ఎకరా భూమికి రూ.50 లక్షలు ఇచ్చారని, ఈ ప్రాంతంలోనూ అదే రీతిగా పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోడు భూములకు సైతం అదేవిధంగా పరిహారం చెల్లించాలన్నారు. గ్రామాలు ఖాళీ చేసే నాటికి 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులందరికీ కట్‌ ఆఫ్‌ డేట్‌ తొలగించి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశానికి కూనవరం వైస్‌ఎంపిపిసభ్యులు కొమరం పెంటయ్య అధ్యక్షత వహించారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాగమణి, అమ్మాజీ, జయసుధ, నాయకులు కుంజా రాధా, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, సిఐటియు నాయకులు మట్ల వాణిశ్రీ పాల్గొన్నారు.