- ప్రభుత్వ భూముల నిర్వహణ బాధ్యత యుడిఎలకు
- ప్రతిపాదనలు తయారు చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలు వేగవంతంగా విస్తరిస్తుండటం, పలు మండలాలు మున్సిపాలిటీ పరిధిలో చేరిపోతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, కనీస సౌకర్యాల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం ఆయా పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములన్నింటిని కలిపి ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల పరిధిలోని ప్రభుత్వ భూములను అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (యుడిఎ)లకు అప్పజెప్పాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎపిఎంఆర్‌యుడిఎ యాక్ట్-2016 ప్రకారం పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కనీస వసతులు కల్పించి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యతలను యుడిఎలకు ప్రభుత్వం అప్పజెప్పనుంది. పట్టణాల్లోని ప్రభుత్వ భూములను యుద్ధ ప్రాతిపదికన గుర్తించాలంటూ జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి తాజాగా ఆదేశాలు వెళ్లాయి. పట్ణణ ప్రాంతాల్లోని భూముల వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి పంపిన అనంతరం ప్రభుత్వం ల్యాండ్ బ్యాంకులకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇందుకు సంబంధించిన మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి నేతృత్వంలో 07.06.23న ఓ కీలక సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాలు మున్సిపాలిటీ పరిధిలోకి, కొత్తగా చేరిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల విస్తరణకు ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు అవసరమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. వేగవంతంగా పట్టణాలు విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల నుంచి ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి పెద్ద సంఖ్యలో వినతులు వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ల్యాండ్ బ్యాంకుల ఏర్పాటు ప్రస్తావనను ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని భూములను పరిశ్రమలు, సంస్థల పేరుతో ప్రభుత్వాలు సంపన్నులకు కట్టబెట్టాయి. ఇక పట్టణ ప్రాంతాల్లోని భూములను కూడా వారికి అప్పగించడానికి అవసరమైన పథకం రూపొందించడంలో భాగమే ఈ ల్యాండ్ బ్యాంకులని పరిశీలకుల భావన. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 21 యుడిఎలు ఉండగా వాటి పరిధిలో 667 మండలాలు, 121 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 4 కోట్ల మందికి పైగా జనాభా నివసిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు ప్రధానంగా ఆయా పట్టణాల్లో మాస్టర్ ప్లాన్స్, ఏరియా డెవలప్‌మెంట్ ప్లాన్స్, జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్స్, టౌన్ ప్లానింగ్ (ప్రజలకు కనీస సౌకర్యాలు, మౌలిక వసతులకు తగ్గట్లు) అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆయా పట్టణాల్లోని స్థానిక సంస్థలపై ఉంది. ఎపిఎమ్‌ఆర్‌యుడిఎ చట్టం-2016లోని సెక్షన్ 96 ప్రకారం ల్యాండ్ డెవలప్‌మెంట్ బ్యాంకును ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. సెక్షన్ 97(1) ప్రకారం ప్రభుత్వం ఫ్రభుత్వ భూములను యుడిఎలకు అప్పజెప్పే అధికారం ఉంటుంది. 97(2) ప్రకారం అభివృద్ధి పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వ భూములు యుడిఎవద్ద ఉంచేందుకు ప్రభుత్వం అనుమతినిస్తోంది.










