- తగ్గుతున్న ఎస్‌సి, ఎస్‌టి లబ్ధిదారులు
- 1.41 లక్షల కుటుంబాలకు షాక్
- విద్యుత్ భారం తగ్గించుకునే పనిలో ప్రభుత్వం
- సచివాలయాల డేటాతో ఇపిడిసిఎల్ కత్తెర
ప్రజాశక్తి- అనకాపల్లి ప్రతినిధి : దళిత, గిరిజన కుటుంబాలకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం ఎసరుపెట్టింది. మాట తప్పను, మడప తిప్పనంటూనే చేసిన వాగ్దానాల భారాన్ని వదిలించుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చూస్తోంది. నెలకు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న ప్రభుత్వం ఉచిత విద్యుత్ వినియోగదారుల సంఖ్యను తగ్గించేందుకు నిబంధనలు విధించారు. వీటికితోడు ఉచిత విద్యుత్‌ను కాలనీలకు పరిమితం చేశారు. దీంతో, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎపి ఇపిడిసిఎల్) పరిధిలోని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 1,41,460 ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలు ఉచిత విద్యుత్‌కు దూరమయ్యాయి. 2019-20లో 7,71,883 ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలు ఉచిత విద్యుత్ లబ్ధి పొందగా, 2020-21 నాటికి 7,84,409కు పెరిగాయి. 2021-22 నాటికి 8,16,585 కుటుంబాలు ఉచిత విద్యుత్ సౌకర్యం పొందాయి. ఇలా ఏటా లబ్ధిపొందుతున్న కుటుంబాలు పెరగడంతో ఆ సంఖ్యను కుదించి, సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచింస్తోంది.
ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాల ఉచిత విద్యుత్‌పై అర్హులను వడపోసే పని ఇపిడిసిఎల్ చేసింది. ఎంతచేసినా లబ్ధిదారుల సంఖ్యలో పెద్ద మార్పులేకపోవడంతో సచివాలయాలు ఇచ్చిన అర్హత జాబితా ప్రకారం ఉచిత విద్యుత్ వర్తింపజేయాలని ఆదేశించింది. సచివాలయాలు వడపోసి ఇచ్చిన జాబితా ప్రకారం... 2021-22 ఏడాది కంటే 2022-23 మార్చి 31 నాటికి 1,41,460 కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందకుండా పోయింది. వాటిలో దళిత కుటుంబాలు 96,529, గిరిజన కుటుంబాలు 44,931 ఉన్నాయి.











