Jul 08,2023 07:20
  • ఫసల్‌లో చేరాక దారుణం
  •  ప్రీమియం రూ.1,882 కోట్లు
  •  ఇన్సూరెన్స్‌ రూ.572 కోట్లు
  •  సంస్థలకు రూ.1,310 కోట్లు మిగులు
  •  ప్రైవేటు లూటీ రూ.780 కోట్లు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : విపత్తులతో పంటలు నష్టపోయిన రైతన్నలకు ఆసరా కావాల్సిన పంటల బీమా కాస్తా ప్రభుత్వ విధానాలతో ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలు అపరిమిత లాభాలు పోగేసుకోడానికి బాగా ఉపయోగపడుతోంది. నిరుటి ఖరీఫ్‌ రైతులకు చెల్లించనున్న బీమా పరిహారం ప్రతిపాదనలు కంపెనీల లూటీని బయటపెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన వలన ఇన్సూరెన్స్‌ కంపెనీలు బాగుపడుతున్నాయని వైసిపి ప్రభుత్వం కేంద్ర పథకం నుంచి వైదొలిగింది. సొంతంగా 'వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాను తొలి మూడేళ్లూ అమలు చేసింది. కేంద్రం ఒత్తిడితో తిరిగి 2022 ఖరీఫ్‌ నుంచి కేంద్ర పథకంలో చేరింది. ప్రీమియంలో రైతు వాటా తానే పెట్టుకుంటోంది. దిగుబడి ఆధారిత పంటల బీమా అమలుకు బిడ్డింగ్‌ ద్వారా కంపెనీలను ఎంపిక చేసి, వాతావరణ ఆధారిత బీమాను గతంలో మల్లే కంపెనీలతో సంబంధం లేకుండా తానే సొంతంగా అమలు చేసింది. కాగా 2022 ఖరీఫ్‌ బీమా క్లెయిములను ఖరారు చేసి అభ్యంతరాల స్వీకరణకు ఆర్‌బికెలలో ప్రదర్శించారు. కంపెనీలు అమలు చేసిన దిగుమతి ఆధారిత బీమాలో రైతులకు వచ్చింది స్వల్పం కాగా కంపెనీలు పోగేసుకున్నది చాలా ఎక్కువ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి రైతుల తరఫున కంపెనీలకు చెల్లించిన ప్రీమియం రూ.1,882.61 కోట్లు. కంపెనీలు రైతులకు చెల్లించతలపెట్టిన పరిహారం రూ.572.56 కోట్లు మాత్రమే. కంపెనీల లాభం దాదాపు రూ.1,310 కోట్లు. ఇందులో ప్రైవేటు కంపెనీల లాభం రూ.781 కోట్లుగా ఉంది.

  • పబ్లిక్‌ సంస్థలే బెటర్‌

రాష్ట్రంలోని 26 జిల్లాలను తొమ్మిది క్లస్టర్లుగా విభజించి కంపెనీలను ఎంపిక చేసి దిగుబడి ఆధారిత పంటల బీమా అమలు చేశారు. హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్‌ రెండేసి క్లస్టర్లు, ఇఫ్‌కో టోకియో ఒక క్లస్టర్‌ తీసుకోగా ప్రభుత్వరంగ సంస్థలైన ఎస్‌బిఐ, ఎఐసిలు రెండేసి క్లస్టర్లు తీసుకున్నాయి. ఉన్నంతలో ప్రభుత్వరంగ సంస్థలైన ఎఐసి, ఎస్‌బిఐలు రైతులకు కొంత న్యాయం చేయగా, ప్రైవేటు కంపెనీలు ప్రీమియాన్ని కొల్లగొట్టేపనిలోనే ఉన్నాయి. మొత్తం రూ.572 కోట్ల పరిహారం చెల్లింపులకు ఓకే చేయగా, అందులో రూ.502 కోట్లు ప్రభుత్వరంగ సంస్థలైన ఎఐసి, ఎస్‌బిఐ చెల్లిస్తున్నాయి. ప్రైవేటు కంపెనీలు కేవలం రూ.70 కోట్లిస్తున్నాయి. ఎఐసి, ఎస్‌బిఐ దాదాపు వెయ్యి కోట్ల ప్రీమియం వసూలు చేసి రైతులకు వాటిలో సగభాగం పంపిణీ చేస్తుండగా, ప్రైవేటు సంస్థలు రూ.800 కోట్లకుపైన ప్రీమియం వసూలు చేసి రూ.70 కోట్లే రైతులకు ఇస్తున్నాయి. రైతుల తరఫున ప్రభుత్వాలు చెల్లించిన ప్రీమియంలో దాదాపు రూ.780 కోట్లు ప్రైవేటు కంపెనీలు మిగిల్చుకుంటున్నాయి.

  • సున్నా క్లెయిములు వారివే..

అన్నమయ్య, గుంటూరు, విశాఖపట్నం జిల్లాలకు దిగుబడి ఆధారిత బీమా క్లెయిములు సున్నా. ఆ జిల్లాలకు ఇంప్లిమెంట్‌ ఏజెన్సీలుగా వ్యవహరించింది ప్రైవేటు సంస్థలే. అన్నమయ్య జిల్లాకు హెచ్‌డిఎఫ్‌సి, గుంటూరుకు రిలయన్స్‌, విశాఖపట్నానికి ఇఫ్‌కో టోకియో అమలు చేశాయి. అనంతపురంలో రూ.269 కోట్ల ప్రీమియం వసూలు చేసిన రిలయన్స్‌ సంస్థ రైతులకు కేవలం రూ.43 కోట్లిస్తోంది. కృష్ణా జిల్లాలో వంద కోట్లకు పైన ప్రీమియం వసూలు చేసిన ఇఫ్‌కో టోకియో కంపెనీ రూ.57 లక్షల పరిహారం నిర్ధారించింది. ఎన్‌టిఆర్‌ జిల్లాలో వంద కోట్ల ప్రీమియం తీసుకున్న ఆ కంపెనీ రూ.3.92 కోట్ల క్లెయిములు ప్రతిపాదించింది. శ్రీకాకుళంలో హెచ్‌డిఎఫ్‌సి సంస్థ రైతుల పక్షాన వంద కోట్ల ప్రీమియం తీసుకొని రూ.32 లక్షల క్లెయిములు ఇస్తానంది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఎఐసి పరిహారం ఇస్తోంది. ఆ జిల్లా రైతుల తరపున రూ.191 కోట్ల ప్రీమియం తీసుకున్న ఎఐసి రూ.172 కోట్ల పరిహారం ఇస్తోంది. అలాగే కడపలో రూ.245 కోట్ల ప్రీమియం తీసుకొని రూ.139 కోట్లు రైతులకు పరిహారం చెల్లిస్తోంది.

table