Nov 17,2022 20:09

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆక్వా రంగం 'జె ట్యాక్స్‌' వల్లే ఇబ్బందులపాలవుతోందని టిడిపి నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. టిడిపి కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సీడ్‌ యాక్టు వల్ల నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగం లేదన్నారు. నాణ్యమైన సీడ్‌ దొరకడం లేదన్నారు. 'జె ట్యాక్స్‌' కోసం సీడ్‌ వ్యాపారులపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఆక్వా ఎగుమతిదారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్య్సశాఖ సబ్‌ కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులు సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ ఎసి రూముల్లో కూర్చొని సమీక్షిస్తే రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఆక్వా ఉత్పత్తులను మద్దతు ధరకు కొనేదాకా పోరాడుతామని తెలిపారు.