Jun 24,2023 09:51
  • మోడీ, జగన్‌లకు పాలించే హక్కులేదు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, కూనవరం : పోలవరం నిర్వాసితుల హక్కులను కాలరాస్తోన్న కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాలకు పాలించే హక్కు లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి తలపెట్టిన పోరుకేక మహా పాదయాత్ర నాలుగో రోజైన శుక్రవారం కూనవరం మండలం కూటూరు నుంచి ప్రారంభమైంది. రెడ్‌ షర్ట్‌ వలంటీర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నాల్గో రోజు యాత్రలో భాగంగా లింగాపురం, రేగులపాడులలో సభలు నిర్వహించారు. ఈ సభలకు కూనవరం వైస్‌ ఎంపిపి కొమరం పెంటయ్య అధ్యక్షత వహించారు. ఆయా సభల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విభజన చట్టాన్ని తుంగలో తొక్కి రాష్ట్రానికి మొండిచేయి చూపిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులకు పరిహారం, పునరావాసం విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రశ్నించాల్సిన రాష్ట్ర పాలకులు ఇక్కడ వెర్రి కేకలు వేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. దమ్ముంటే మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. పోలవరం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గాలను సహించేది లేదన్నారు. తాడో పేడో తేల్చుకొనే సమయం ఆసన్నమైందని తెలిపారు. జులై 4న విజయవాడలో జరిగే మహా ధర్నాకు ప్రతి గ్రామం నుంచి నిర్వాసితులు పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల ముందు పోలవరం నిర్వాసితులకు నాటి ప్రతిపక్ష నేత జగన్‌ ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. వీటిని అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. జులై 4లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. అభిచర్ల గ్రామంలో జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ ఓ భారీ ప్రాజెక్టును నిర్మిస్తోన్న క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం కల్పించే పద్ధతి ఇదేనా? అని ప్రశ్నించారు. వందల సంవత్సరాల నుంచి ఆదివాసీలు ఇక్కడే నివసిస్తున్నారన్నారు. గిరిజన చట్టాలను సైతం తుంగలో తొక్కి మోడీ ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. లింగాపురంలో జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ మాట్లాడుతూ జులై 4న జరిగే ధర్నాకు పోలవరం నిర్వాసితులు గోదారి తరంగాలవలే కదిలి రావాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.వాణిశ్రీ మాట్లాడారు.