Feb 02,2022 17:24

న్యూఢిల్లీ : నిరుద్యోగ సమస్య ప్రధాని మోడీ ప్రభుత్వానికి పట్టడం లేదంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌ 2022 సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో కేవలం 60 లక్షల ఉద్యోగాలిస్తామని తాజా బడ్జెట్‌లో చెప్పారన్నారు. ' దేశంలో నిరుద్యోగం విస్తృతంగా ఉంది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మూతపడటం, పెట్టుబడులు రాకపోవడం, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోవడంతో యువత ఆందోళన చెందుతున్నారు' అని వ్యాఖ్యానించారు. 2014లో ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చలేదంటూ విమర్శించారు. ' 2014లో ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలిస్తానన్నారు. ఆ లెక్క ప్రకారం ఇప్పటికే 15 కోట్ల ఉద్యోగాలివ్వాలి. కానీ మీరేన్ని ఉద్యోగాలు ఇచ్చారు?' అంటూ ప్రశ్నించారు. కేంద్రంలో 9 లక్షల ఖాళీలున్నాయని అన్నారు. 15 శాతం రైల్వేలో, 40 శాతం రక్షణ, 12 శాతం హోమ్‌ వ్యవహార శాఖలో ఖాళీలున్నాయని తెలిపారు. నిరుద్యోగిత రేటు అర్బన్‌ ప్రాంతంలో 9 శాతం, రూరల్‌ ఏరియాలో 7.2 శాతం ఉన్నాయని చెప్పారు.