ప్రజాశక్తి-పెడన: మహిళలే కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటున్నారని గతంతో సరిపోలిస్తే, ఇప్పుడు అన్ని రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారని, బరువు బాధ్యతలు మోస్తూ ఏ రంగంలోనైనా నిర్ణయాత్మక పాత్ర వారే పోషిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కొనియాడారు. సోమవారం ఉదయం ఆయన పెడన మండలంలోని బల్లిపర్రు, చెన్నూరు, చోడవరం, చేవేండ్ర, గుడివిందగుంట, కొంగనచర్ల, జింజేరు, అచ్చయ్యవారిపాలెం, కాకర్లమూడి, కమలాపురం, కుంకేపూడి, కోప్పల్లి, ముచ్చర్ల, మడక, నడుపూరు, కూడూరు, నందమూరి, నందిగామ, పెనుమిల్లి, సిరివర్తర్లపల్లి, నేలకొండపల్లి, పుల్లపాడు, ఉరివి, లంకలకలువగుంట గ్రామాలకు చెందిన 2121 మంది లబ్ధిదారులకు 3కోట్ల 97 లక్షల 68 వేల 750 రూపాయలను పెడన వ్యవసాయ మార్కెట్ యార్డులో వైయస్సార్ చేయూత ఆర్ధిక సహాయం మూడో విడత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి జోగి రమేష్ వేలాదిమంది మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, మిమ్మల్ని అందరిని చూస్తుంటే దేవీ నవరాత్రులలో కనకదుర్గమ్మ తల్లిని చూసినంత సంతోషంగా ఉందని అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. వేదాల నుంచి ఉద్భవించిన సనాతన ధర్మంలో మహిళకు పూజనీయ స్థానం ఉందని, స్త్రీని దేవతగా పూజించడం ఇక్కడ మాత్రమే ఉందన్నారు. మహిళలు విద్యావంతులైతే ఆ కుటుంబం, సమాజం అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. మహిళలు జ్ఞానాన్ని అలవరచుకుని స్త్రీ పురుష సమానత్వాన్ని చాటాలన్నారు. సమాన అవకాశాలు కల్పించడం ద్వారా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించగలరన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో పేద అక్కచెల్లెమ్మల కష్టాలను ఆయన ప్రత్యక్షంగా చూశారని, వారిని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధిలోనికి తీసుకురావాలని అభిలషించారన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గరికిపాటి చారుమతి రామానాయుడు, మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు రాజులపాటి అచ్యుతరావు, వైస్ ఎంపీపీ పరసా వాకాలమ్మ, వ్యవసాయ సలహా సంఘం మండల అధ్యక్షుడు బొల్లా వెంకటేశ్వరరావు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు డి.భైరవలింగం, పెడన వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి నాగబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోయ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి పామర్తి సాంబశివరావు, మతిన్ ఖాన్, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.










