Oct 07,2022 22:47

స్టాక్‌హౌం : బెలారస్‌కి చెందిన మానవ హక్కుల కార్యకర్త అలెస్‌ బియాలి యాత్‌స్కీతోపాటు రష్యా మానవ హక్కుల సంఘం మెమోరియల్‌, ఉక్రేనియన్‌ మానవ హక్కుల సంస్థ సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌లకు ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారం లభించింది. విజేతలు తమ దేశాల్లో పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు, యుద్ధ నేరాలను, మానవ హక్కుల ఉల్లంఘనలను, అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కృషి చేస్తున్నారని రాయల్‌ అకాడమీ తెలిపింది. అలెస్‌ బెలారస్‌లో ప్రజాస్వామ్యం, శాంతియుత అభివృద్ధి కోసం మానవ హక్కుల సంస్థను 1996లో స్థాపించారు. 2020 నుంచి ఎలాంటి విచారణ లేకుండా నిర్బంధంలో ఉన్నారు. పూర్వపు సోవియట్‌ యూనియన్‌లోని మానవ హక్కుల కార్యకర్తలందరూ కలిసి 1987లో ఏర్పాటు చేసిన రష్యా మానవ హక్కుల సంస్థ మెమోరియల్‌ మరో విజేతగా ఉంది. ఇక మూడో సంస్థ సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ ఉక్రెయిన్‌లో మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం కృషి చేస్తోందని తెలిపింది.