- ప్రభుత్వ తీరుపై లోకేష్ ఆగ్రహం
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : నిరాహార దీక్షకు దిగిన వారిపౖౖె హత్యాయత్నం కేసు పెట్టి రిమాండ్‌కు పంపిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలను ధర్నా చౌక్‌లో కూడా అనుమతించకపోవడం జగన్ ప్రభుత్వ నియంత పోకడలకు అద్దం పడుతోందని విమర్శించారు. ఇవన్నీ ప్రభుత్వ బలహీనత, జగన్‌లో భయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. స్కిల్ డవలప్‌మెంట్ కుంభకోణం కోసులో చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు తరలించినప్పటి నుంచి రాజమహేంద్రవరంలోనే లోకేష్ బస చేశారు. బుధవారం ఆయన వివిధ జిల్లాల టిడిపి నేతలతో భేటీ అయ్యారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల అంశంతోపాటూ, అరెస్టుపై పార్టీ చేపట్టిన నిరసనలపై వారితో చర్చించారు. చంద్రబాబు అరెస్టుతో జగన్ తాత్కాలిక ఆనందం పొంది ఉండవచ్చని, కానీ ప్రజలు దీన్ని ఆమోదించే పరిస్థితి లేదని అన్నారు. చంద్రబాబు అరెస్టుపై అన్ని వర్గాల్లో అసంతృప్తి, ఆవేదన రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుపై మద్దతు తెలిపిన నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపి కనకమేడల రవీంద్ర, పలువురు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, మాజీ ఎంపిలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.










