Jun 12,2023 14:38

ముంబయి  :    బీమా కొరెగావ్‌ కేసులో మొదటి అరెస్ట్‌ జరిగి ఈ నెలతో ఐదేళ్లు పూర్తయ్యాయి. తీవ్ర అనారోగ్య సమస్యలతో జైలులో మరణించిన స్టాన్‌ స్వామి సహా మొత్తం 16 మందిని ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ కొంతమంది జైలులోనే మగ్గుతున్నారు. అదుపులోకి తీసుకున్న వారెవరూ ఇంతవరకూ దోషులుగా తేలలేదు. బీమా కొరెగావ్‌లో జరిగిన హింసాకాండలో వీరెవరికీ ప్రత్యక్ష సంబంధమూ లేదు. వారిని అరెస్ట్‌ చేసిన చట్టం నియంతృత్వ, ప్రభుత్వ అమానుష స్వభావానికి ఉదాహరణగా నిలుస్తోంది.

చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యుఎపిఎ) కింద మొత్తం కేసుల్లో 10 శాతం కంటే తక్కువ కేసులు నమోదు కాగా, అన్ని కేసుల్లో నాలుగో వంతు మాత్రమే దోషులుగా నిర్థారించబడ్డాయి. ఈ కేసులో అరెస్ట్‌ అయిన వారంతా వివిధ రంగాల్లో నిపుణులు, అధ్యాపకులు, న్యాయవాదులు, రచయితలు, హక్కుల కార్యకర్తలు. వీరంతా కేంద్ర ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నించిన వారే కావడం గమనార్హం. ఈ ఫిర్యాదు దాఖలు చేసిన వ్యక్తి తాను హిందూత్వ నియమాలను అనుసరిస్తున్నట్లు పేర్కొన్నారు. మనం హిందూత్వ వాదానికి మద్దతు పలికే వారిని ఉంచాలని, లేనట్లైతే వారిని పక్కన పెట్టాలని బహిరంగంగా  వెల్లడించడం గమనార్హం.

ఈ కేసులో బిజెపి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు, ప్రధాని మోడీని హత్య చేసేందుకు యత్నించినట్లు ఆరోపణలను కూడా చేర్చారు. అనంతరం మహారాష్ట్రలో బిజెపి ఓటమి పాలవడంతో ఈ ఆరోపణలను పూణె పోలీసులు తప్పించారు. ఉద్ధవ్‌ థాకరే 2019 నవంబర్‌ 28న ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎన్‌ఐఎ)కి అప్పగించినట్లు థాకరే ప్రభుత్వానికి తెలిపింది.

ఈ కేసులో అరెస్ట్‌ అయిన వారి పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంత దురుసుగా ప్రవర్తించిందనడానికి ఈ కింది ఘటనలు ఉదాహరణలుగా నిలుస్తాయి. పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్న స్టాన్‌ స్వామికి జైలులో గ్లాస్‌కు బదులుగా సిప్పర్‌ను అనుమతించేందుకు కూడా అధికారులు నిరాకరించారు. అర్థరైటిస్‌తో బాధపడుతున్న సోమా సేన్‌ జైలులో ఆమె సొంత కమోడ్‌ చైర్‌ను అనుమతించేందుకు కూడా నిరాకరించారు. సురేంద్రా గాడ్లింగ్‌పై యుఎపిఎతో పాటు ఐటియాక్ట్‌ను కూడా ప్రయోగించారు. ఆయన వద్ద ఉన్న స్వామి వివేకానందకి సంబంధించిన నాలుగు పుస్తకాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వాటిపై భారత్‌ నిషేధం ఉందో లేదా అనేది న్యాయమూర్తులు కూడా ఖచ్చితంగా తెలియదని పేర్కొన్నారు. అనంతరం వాటిని అప్పగించాల్సిందిగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా జైలు అధికారులు ఇప్పటివరకు అప్పగించకపోవడం గమనార్హం. అలాగే వులెన్‌ స్వెటర్స్‌కు జైలులోకి అనుమతి లేదంటూ ఆయనకు స్వెటర్‌ను కూడా నిరాకరించారు.
ఆయన దాఖలు చేసిన పత్రాల్లో ఆయన తల్లి డెత్‌ సర్టిఫికేట్‌ లేదంటూ తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అధికారులు  నిరాకరించారు. సుధీర్‌ ధావలే సోదరుడు మరణించినా... డెత్‌ సర్టిఫికెట్‌ లేదంటూ అనుమతి నిరాకరించారు. చివరికి   ..  తల్లి మరణించినా... కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురిచేయడం ఇష్టం లేక వెర్నన్‌ గోన్సల్వేస్‌ బెయిల్‌ కోసం కూడా దరఖాస్తు చేయలేదు.  గౌతమ్‌ నవలఖ (70) కళ్లజోడు జైలులో దొంగిలించబడ్డాయి. మూడు రోజులైనా జైలు అధికారులు వాటిని అందించలేదు.

మోడీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ బీమా కొరెగావ్‌ కేసులో నిందితులపై మోపిన అభియోగాలు వట్టి బూటకమని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక వెల్లడించింది. హక్కుల కార్యకర్తలకు వ్యతిరేకంగా నిందితుల కంప్యూటర్ల నుంచి లభించాయని చెబుతున్న పది 'కీలక ఆధారాలు' పూర్తిగా కల్పితాలని అమెరికాకు చెందిన ఆర్సెనల్‌ ఫోరెన్సిక్‌ సంస్థ శోధనలో తేలింది. ఇదంతా ప్రభుత్వ ప్రమేయంతో పకడ్బందీగా జరిగిన కుట్ర అన్న అనుమానాలకు ఆర్సెనల్‌ నివేదిక మరింత బలం చేకూర్చింది. నిందితుల కంప్యూటర్లలో వారికి తెలియకుండానే అరుదైన మాల్‌వేర్‌ సహాయంతో హ్యాకర్‌ దాడి చేశాడని ఆ నివేదిక పేర్కొంది. బీమా కొరెగావ్‌ కేసులో అరెస్టయి ప్రస్తుతం జైల్లో వున్న కార్యకర్తల్లో ఒకరైన రోనా విల్సన్‌కి చెందిన ల్యాప్‌టాప్‌లోకి చొరబడేందుకు మాల్‌వేర్‌ను ఉపయోగించిన దుండగుడు... ఆ కంప్యూటర్‌లో 10లేఖలను వుంచారని మసాచుసెట్స్‌ కేంద్రంగా పనిచేసే డిజిటల్‌ ఫోరెన్సిక్‌ సంస్థ ఆర్సెనల్‌ కన్సల్టింగ్‌ తన నివేదికలో పేర్కొంది. విల్సన్‌ లాయర్ల అభ్యర్ధన మేరకు ల్యాప్‌టాప్‌ను ఆ సంస్థ పరిశీలించింది

బీమా కొరెగావ్‌ కేసు మాత్రమే కాదు .. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అసమ్మతి వ్యక్తం చేసిన వారిపై చట్టాన్ని దుర్వినియోగం చేస్తోంది.