Mar 22,2023 12:46
  • పేదలకు గృహాలు అప్పగింత ఎన్నడో ?

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ఉగాదికి ఐదులక్షల మందికి ఒకేరోజు గృహ ప్రవేశాలు చేయిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. ఆచరణలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే అనేకసార్లు గృహ ప్రవేశాల తేదీల్లో మార్పులు చేస్తూ వచ్చిన ప్రభుత్వం చివరికి ఉగాదికి గృహ ప్రవేశాలు చేయించాలని నిర్దేశించుకున్న లక్ష్యం కూడా నెరవేరలేదు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గృహ నిర్మాణశాఖ 2023-24 ఫలితాల బడ్టెట్‌లో 4.40 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నట్లు పేర్కొంది. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద మహిళల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 30,65,315 లక్షల మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. 2023 డిసెంబరు నాటికి 21.25 లక్షల మంది లబ్ధిదారులకు అందులో తొలి విడతగా 15.36 లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ఆచరణలో అమలుకు నోచలేదు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిర్మాణాలు వేగం పుంజుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కనీసం ఉగాదికి ఐదు లక్షల ఇళ్లను పూర్తిచేసి రికార్డును సొంతం చేసుకోవాలనే ప్రభుత్వ ఆశయం నెరవేరే అవకాశాలు కనబడలేదు. ప్రతి లబ్ధిదారునికీ పావలావడ్డీ (3శాతం)తో బ్యాంకులు రూ.35 వేల రుణాన్ని అందిస్తున్నాయి. ఇప్పటి వరకు 8.92 లక్షల మంది లబ్ధిదారులకు రూ.3,142.24 కోట్ల బ్యాంకు రుణాలు అందాయి. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద గృహ నిర్మాణాలు, ఇంటి స్థలంతో కలిపి రూ.1,46,520 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

333