Jun 05,2023 14:06
  • లోపాలను ఎత్తిచూపినా పట్టించుకోలేదు
  • ట్రాక్‌ల నిర్వహణ, బడ్జెట్‌ కేటాయింపులు, వ్యయం, పోస్టుల ఖాళీలపై తీవ్ర నిర్లక్ష్యం

న్యూఢిల్లీ : ఒడిశా రైలు ప్రమాద ఘటన దేశాన్ని తీవ్రంగా కలచి వేసింది. ప్రపంచ దేశాధినేతల నుంచి సైతం విచారం వ్యక్తమైంది. అయితే ఈ ప్రమాదం విషయంలో మోడీ సర్కారు తీరు విమర్శల పాలవుతున్నది. రైల్వేలలో కనీస అవసరాలకు ప్రాధాన్యతనివ్వకుండా, సాధారణ ప్రయాణికుడిని విస్మరిస్తూ కేవలం వందే భారత్‌, బుల్లెట రైళ్ల పైనే శ్రద్ధ కనబర్చటంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రైలు ప్రమాద ఘటన జరిగిన తర్వాత రైల్వేల పనితీరును మెరుగుపర్చడానికి ప్రభుత్వం చేసిన అన్ని వివరాలను విడుదల చేస్తూ ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే, ప్రభుత్వ వాదనలు దాని స్వంత ఆడిటర్‌ అయిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) గతేడాది నివేదికలో చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నాయి. రైలు భద్రతపై కాగ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాక్‌ల పునరుద్ధరణకు నిధుల కేటాయింపు తగ్గిందనీ, కేటాయించిన నిధులును కూడా పూర్తిగా వినియోగించడం లేదని పేర్కొన్నది. ఒడిశా ఘోర రైలు ప్రమాద నేపథ్యంలో గతేడాది కాగ్‌ నివేదిక ప్రస్తుతం చర్చనీయంగా మారింది.
          రైల్వే ఆధునీకరణ, భద్రత విషయంలో ప్రభుత్వం చాలా కృషి చేసిందన్న ప్రభుత్వ వాదనను బలపరిచేందుకు పీఎంఓ వర్గాలు శనివారం సమాచారాన్ని పంచుకున్నాయి. విపత్తుకు బాధ్యులైన వారికి ''కఠినమైన శిక్ష'' విధించబడుతుందని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటనా చేశారు. అయితే ఈ ప్రకటన.. రైల్వేలు లేదా తన ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాలతో తలెత్తిన వ్యవస్థాగత సమస్యల కంటే వ్యక్తిగత చర్యల ఫలితంగా ప్రమాదం జరిగిందని ప్రజలకు చెప్పే యత్నమని విశ్లేషకులు భావిస్తున్నారు.
         గతేడాది కాగ్‌ నిర్వహించిన రైల్వే పనితీరు ఆడిట్‌, తర్వాత అందించిన నివేదిక.. ప్రభుత్వ వాదనలకు పూర్తి భిన్నంగా ఉన్నది. 2017-2021 మధ్య జరిగిన రైల్వే ప్రమాదాలపై కాగ్‌ విశ్లేషణ ప్రకారం.. ఈ కాలంలో మొత్తం 2017 ప్రమాదాలు జరిగాయి. అందులో పట్టాలు తప్పినవి 1392 ప్రమాదాలు(69 శాతం). అంటే పట్టాలు తప్పి ఢ కొనటం వంటి రైల్వే ప్రమాదాలే అధికంగా ఉండటం గమనార్హం. అయితే ఈ ప్రమాదాలకు కారణం 'మానవ తప్పిదం' అని నిందించటం ఏండ్లుగా ఒక సాధారణ ధోరణిగా మారిందనీ, అయితే కాగ్‌ నివేదిక ప్రభుత్వ వాదనలు తప్పని నిరూపిస్తున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. భారత రైల్వే అనేకానేక ఖాళీలతో, నామ మాత్రపు అవుట్‌సోర్సింగ్‌తో కార్యకలాపాలను నిర్వహించిందని కాగ్‌ వెల్లడించింది.
         2017-18లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ రైల్‌ సంరక్ష కోష్‌(ఆర్‌ఆర్‌ఎస్‌కే) ప్రసిద్ధి చెందిన రైల్వే భద్రతా నిధి గురించి కాగ్‌ ఉటంకించింది. 1127 పట్టాలు తప్పగా.. 289 (26 శాతం) మాత్రమే పునరుద్ధరణ పనులకు నోచుకున్నాయని వివరించింది. ఆర్‌ఆర్‌ఎస్‌కే నుంచి ప్రాధాన్యత-1 పనులపై మొత్తం వ్యయం 2017-18లో 81.55 శాతం నుంచి 2019-20లో 73.76 శాతానికి తగ్గుదల ధోరణిని చూపించిందని పేర్కొన్నది. ట్రాక్‌ పునరుద్ధరణ పనులకు 2018-19లో నిధుల కేటాయింపు రూ.9607.65 కోట్ల నుంచి 2019-20లో రూ.7417 కోట్లకు తగ్గింది అని కాగ్‌ వివరించింది. ముఖ్యంగా ప్రాధాన్యత లేని ప్రాంతాలకు నిధుల వినియోగం అనేక మండలాల్లో 25 శాతం వరకు పెరిగిందని నివేదిక పేర్కొన్నది. అత్యంత రద్దీగా ఉండే పశ్చిమ రైల్వే కోసం 2019-20లో మొత్తం వ్యయంలో ట్రాక్‌ పునరుద్ధరణ కోసం ఖర్చు చేసినది 3.01 శాతమే కావటం గమనార్హం. భద్రతకు సంబంధించిన పనులకు ఆర్థిక సాయం అందించటానికి ప్రత్యేక నిధిని సృష్టించే ఏకైక ఉద్దేశ్యం విజయం సాధించలేకపోయిందని కాగ్‌ పేర్కొన్నది. పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం ట్రాక్‌ నిర్వహణ అని వివరించింది.