Apr 23,2023 09:02

ఎండాకాలం ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. వాతావరణ కాలుష్యం కారణంగా భూతాపం రోజురోజుకీ పెరిగిపోతోంది. వేసవి నేల తల్లిని నిప్పుల కుంపటిగా మారుస్తోంది. ప్రతి సంవత్సరం ఎండలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఈ సంవత్సరం కూడా ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉంటుందని అంచనా. ఎండాకాలంలో ఎండ వేడిమి ప్రభావం వలన వచ్చే ప్రమాదకర పరిస్థితిని వడదెబ్బ అంటారు. నీడలో ఉన్నా ఇంట్లో ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ తగలవచ్చు. రేకుల షెడ్లలో నివసించే వారికి, గాలి, వెలుతురు చొరబడని ఇళ్ళలో ఉండేవారికి, పిల్లలకు, వృద్ధులకు వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మరి దీని గురించి ప్రజారోగ్య వేదిక మనకు అవగాహన కల్పించాలని పూనుకుంది. కొన్ని సూచనలు, జాగ్రత్తలు ఇస్తోంది. వాటిని పాటించి మనను మనం కాపాడుకుందాం.
లక్షణాలు : విపరీతమైన జ్వరం, తలనొప్పి, తల తిరగడం, గుండె దడ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మం పొడిగా, వేడిగా పెనంమీద పెట్టినట్లు ఉంటుంది. తీవ్ర వడదెబ్బ తగిలితే చెమటలు పట్టవు. నాలుక తడి ఆరిపోతుంది. దప్పిక ఎక్కువగా ఉంటుంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. చివరికి స్పృహ తప్పి పోతారు.

2


ప్రథమ చికిత్స : ఈ లక్షణాలు కనిపించిన వెంటనే రోగిని చల్లని గాలి తగిలే ప్రదేశానికి మార్చాలి. శరీరం మీద బిగుతుగా ఉన్న దుస్తులను తీసేసి పల్చటి బట్ట కప్పాలి. వేపచెట్టు, కానుగ చెట్టులాంటి మంచి నీడ నిచ్చే చెట్టుంటే దాని కిందకు చేర్చడం మంచిది. తల నుంచి కాళ్ళ వరకు చల్లని నీళ్ళుపోసి ఒంటి మీది బట్టలను తడపాలి. ఫ్యాను అందుబాటులో ఉంటే ఒంటిమీద పోసిన నీళ్ళు ఆవిరయ్యే విధంగా ఫ్యాన్‌ను ఉపయోగించడం మంచిది. ప్యాను అందుబాటులో లేకపోతే అట్టముక్కలతో గాని, విసనకర్రతో గాని విసురుతూ ఉండాలి. గుడ్డ ఆరిపోతే మరలా తడపాలి. వడదెబ్బ తగిలినప్పుడు జ్వరం 106 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ కంటే ఎక్కువ ఉండవచ్చు. జ్వరం 100 డి. -102 డి. ఫారన్‌ హీట్‌ మధ్యకు చేరేదాక ఈ తడి గుడ్డ వైద్యం కొనసాగించాలి. జ్వరం తగ్గుముఖం పట్టగానే అపస్మారకం, పిచ్చి మాటల నుండి బయటపడతారు. రోగి తెలివిలో ఉంటే పండ్లరసం, చక్కెర-ఉప్పు కలిపిన నిమ్మ రసం, షర్బత్‌, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, బార్లీ, గంజి లలో ఏ ద్రవ పదార్ధం అందుబాటులో ఉంటే అది 10 ని. కు ఒకసారి పెద్దగ్లాసు (150 యం. యల్‌.) చొప్పున తాగించాలి. ఒకవేళ వాంతి అయినా నీళ్ళు తాగించడానికి వెనుకాడకూడదు. పోయేది పోయినా కొంతైనా పొట్టలో నిలుస్తుంది. ఐస్‌ ముక్కలు చంకల్లో ఉంచితే ఉష్ణోగ్రత త్వరగా తగ్గుతుంది. రోగి అపస్మారక స్థితిలో ఉంటే తడిగుడ్డ వైద్యం చేస్తూనే ఆసుపత్రికి తరలించాలి.

3


తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
1. వీలైనంత వరకు పసిపిల్లలను, ముసలి వాళ్ళను ఎండలో తిరగనీయవద్దు. వీరిని గాలి ఆడే చల్లని ప్రదేశాలలో ఉంచుతూ నీళ్ళు ఎక్కువగా ఇస్తుండాలి.
2. ఎండలో పనిచేయడం అలవాటు లేకుండా కొత్తగా పనికెళ్ళేవారు, స్థూలకాయులు, ఎక్కువ మద్యం తాగేవారు, జ్వరం, విరోచనాలతో బాధపడుతున్న వాల్ళు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి వీళ్ళు ఎండలో పనిచేసేటప్పుడు, తిరిగేటప్పుడు ఎక్కువ జాగ్రత్తపడాలి.
3. బిగుతుగా ఉండే దుస్తులు ధరించరాదు.
4. ఎండ ఎక్కువగా తగులుతూ, గాలి అందనిచోట పనిచేయరాదు.
5. ఎండాకాలం ఉదయం 11 గం. లోపు, సాయంత్రం 4 గం. ల తరువాత పనులు చేసుకోవడం మంచిది. ఈ మధ్యలో కూడా పనిచేయడం తప్పనిసరైతే ఎక్కువగా (గంటకు ఒక లీటరు) నీళ్ళు తాగుతూ పనిచేయాలి.
6. ఎండాకాలంలో ఎవరైనా సరే నల్లని దుస్తులు, ముదురు రంగు దుస్తులు ధరించకూడదు. తెల్లని దుస్తులు, లేత రంగు దుస్తులు ధరిస్తే వడదెబ్బ ప్రమాదం తగ్గుతుంది.
7. నైలాన్‌, టెర్లిన్‌, టెరికాట్‌ దుస్తులు ధరించకూడదు. నూలు (కాటన్‌) దుస్తులు ధరించడం మంచిది.
8. ఎండలో పనిచేసేటప్పుడు తలమీద, మెడచుట్టూ తడిపిన బట్ట చుట్టుకోవాలి. తలమీద టోపీ పెట్టుకోవాలి.
9. ఉదయం 11 గం.ల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కిటికీలకు వట్టి వేళ్ళ తడికెలు కట్టి తడుపుకోవచ్చు. వట్టి వేళ్ళ తడికెలు కొనుక్కోలేని వాళ్ళు కిటికీలకు గుడ్డలు కట్టి ఆ గుడ్డలను నీటితో తడుపుకోవాలి.
10. పసిపిల్లల శరీరమంతా ఉదయం 10 గం.ల నుంచి సాయంత్రం 4 గం.ల వరకు తరచుగా చన్నీళ్ళతో తుడుస్తూ ఉండాలి.
11. ఎండాకాలంలో బయటకు వెళ్ళే సమయంలో గొడుగును ఉపయోగించాలి. చలువ అద్దాలు ధరిస్తే కంటిమీద ఎండ ప్రభావం తగ్గించుకోవచ్చు. మంచినీళ్ళు వెంట తీసుకొని వెళ్ళి తరచుగా తాగుతూ ఉండాలి.
12. ఎండాకాలంతో దూరపు ప్రయాణం మంచిది కాదు. ప్రయాణం చేయవలసి వస్తే రాత్రిపూట ప్రయాణం మంచిది.
13. ఎండాకాలం తప్పకుండా రెండుపూటలా స్నానం చేయాలి.
14. తేలికగా అరిగే ఆహారం తీసుకోవాలి. మాంసాహారాన్ని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. ద్రవ పదార్ధ్లాలు ఎక్కువగా తీసుకోవాలి. అవి కూడా సాధ్యమైనంత వరకు ఇంట్లో తయారు చేసినవి తీసుకోవడం మంచిది.
15. నడక, వ్యాయామం చేసేవారు ఎండలేని సమయంలోనే చేయాలి అంటే ఉదయం 9 గం.ల లోపు సాయంత్రం 5 గం.ల తరువాత తప్పనిసరి అయితే చెట్ల నీడలోవ్యాయామం చేయాలి.
పై సూచనలను పాటించి- వడదెబ్బ నుంచి తప్పించుకుందాం..
''చికిత్సకన్నా నివారణ మిన్న''.. అందుకే
మంచినీళ్ళు, మిజ్జిగ, ఓ. ఆర్‌. యస్‌., కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాగుదాం. ఎండల్లో గొడుగును వాడదాం...
నల్లకళ్ళద్దాలను వాడదాం... మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం.

- ప్రజారోగ్య వేదిక