ప్రజాశక్తి - సింగనమల (అనంతపురం జిల్లా), వడ్డాది (అనకాపల్లి జిల్లా) : వడదెబ్బకు గురై వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు కూలీలు బుధవారం మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... అనంతపురం జిల్లా శింగనమల మండలం గోవిందరాయునిపేట గ్రామానికి చెందిన కట్టుబడి ఇమామ్ హుస్సేన్ (52) ఉపాధి హామీ పనికి వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత వడదెబ్బ వల్ల అస్వస్థతకు గురై సమ్మసిల్లి పడిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు. హుస్సేన్‌కు భార్య ఫాతిమా, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం, వడ్డాది గ్రామానికి చెందిన దొండా గోవర్థనరావు (55) వ్యవసాయ కూలి పనికి వెళ్లారు. అప్పటికే వడదెబ్బకు గురైన ఆయన తిరిగి ఇంటికి వచ్చి తన కుమార్తె స్వాతిని మంచినీరు తీసుకురమ్మని అడిగారు. స్వాతి ఇంటిలోకి వెళ్లి తీరిగి వచ్చేసరికి గోవర్థనరావు కుప్పకూలిపోయారు. చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి ఆయన మృతి చెంది ఉన్నారు. గోవర్థనరావు భార్య సత్యవేణి కేన్సర్ వ్యాధితో మూడేళ్ల క్రితం మృతి చెందారు. ఆయన తల్లి మూడు నెలల క్రితం మరణించారు. అంత్యక్రియలలో తండ్రికి స్వాతి తలకొరివి పెట్టారు.