ప్రజాశక్తి - యంత్రాంగం : ఉష్ణగాలుల ప్రభావంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వడగాలులు, ఉక్కపోతతో సామాన్యప్రజానీకం అల్లాడుతున్నారు. ఎండ వేడిమి తాళలేక బుధవారం నలుగురు మరణించారు. ఏలూరు జిల్లా కొవ్వాడలంక గ్రామానికి చెందిన జల్లూరి ప్రసాదరావు భార్య జయలక్ష్మి చేపల వేట సాగిస్తూ జీవనం సాగిస్తుంటారు. వారం రోజుల క్రితం రేపల్లెలో చేపలవేటకు వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి చేరుకునేందుకు రేపల్లె నుంచి వస్తున్న చేపల లారీ ఎక్కారు. భైరవపట్నం రైల్వే గేటువద్ద లారీ దిగి, ఇంటికి వెళ్లేందుకు మరో ఆటో కోసం వేచి ఉన్నారు. ఈ తరుణంలో ఆమె ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందారని తెలిపారు. ప్రకాశం జిల్లా సుంకేసుల గ్రామ వాసి కొండేటి చిన్నగాలయ్య (50) అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్లి వస్తుండగా.. వడదెబ్బతో మరణించారు. ఆయన ప్రతిరోజు కంభం వెళ్లి కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పెద్దబైలు గ్రామానికి చెందిన సాంబ శివరెడ్డి (65) మంగళవారం తన పొలంలో పనులు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు వెళ్లి చూసేటప్పటికే అచేతన స్థితిలో పడి ఉన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో పంచాయతీ పారిశుధ్య కార్మికులు కావూరి రాంబాబు (64) మంగళవారం తన విధులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి అకస్మాత్తుగా పడిపోయారు వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. ఎండవేడిమికి తాళలేక మరణించినట్లు వైద్యులు తెలిపారు.