హైదరాబాద్ : తెలంగాణలోని కుమురం భీం జిల్లాలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. మరికొద్ది గంటల్లో పెళ్లనగా వరుడు వడదెబ్బ బారిన పడి మృతి చెందాడు. ఈ ఘటన వివరాల ప్రకారం.. కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన శ్యాంరావ్-యశోద దంపతుల పెద్ద కుమారుడు తిరుపతి (32)కి మంచిర్యాల జిల్లా భీమినికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. బుధవారం పెళ్లి ముహూర్తం కాగా కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. పెళ్లిపనుల్లో ఉన్న తిరుపతికి మంగళవారం వడదెబ్బ తగిలింది. దీంతో, కుటుంబసభ్యులు తొలుత అతడిని మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం, మెరుగైన వైద్యం కోసం కాగజ్‌నగర్‌కు తరలించారు. మంగళవారం రాత్రి తిరుపతి ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో మంచిర్యాలలోని మరో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు తిరుపతి మతి చెందాడు. మరికొద్ది గంటల్లో పెళ్లనగా తమ పెద్దకుమారుడు ఇలా అనూహ్యంగా మరణించడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.