Jun 16,2023 21:59
  • అల్లూరిలో ఇద్దరు గిరిజనులు,
  • అనకాపల్లిలో వృద్ద దంపతులు దుర్మరణం
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం

ప్రజాశక్తి - అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : వడదెబ్బకు ఉమ్మడి విశాఖపట్నంలో నలుగురు మరణించారు. అల్లూరి జిల్లాలో ఇద్దరు గిరిజనులు, అనకాపల్లిలో వృద్ద దంపతులు మృతిచెందారు. ఈ రెండు సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అల్లూరి జిల్లా అనంతగిరి మండలానికి చెందిన ఇద్దరు గిరిజనులు వడదెబ్బతో మరణించిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. అనంతగిరి పంచాయతీ పరిధి లక్ష్మీపురం గ్రామానికి చెందిన బడ్నాయిన చంద్రన్న (58) గురువారం ఉదయం తన పొలంలో పనులు ముగించుకుని సాయంకాలం ఇంటికి వచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కుప్పకూలి మృతిచెందారు. ఎగువశోభ పంచాయతీ పరిధి పొర్నపొదర్‌ గ్రామానికి చెందిన సాగర సోమన్న (50) స్థానిక బాలికల పాఠశాల - 2లో కూలి పనికి వెళ్లారు. ఎండవేడిమికి తాళలేక అక్కడే కుప్పకూలిపోయారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి విజయనగరం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కెజిహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. పరిహారం అందించి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొంతలం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు వడగాల్పులతో గురువారం సాయంత్రం చనిపోయారు. తొలుత భర్త తమ్మండ్రు నాగరాజు, ఆ కొద్దిసేపటికే భార్య రాజులమ్మ కన్నుమూశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.