Apr 27,2023 19:37
  • చనిపోయిన కార్మికునికి 15 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి : సిఐటియు డిమాండ్.

ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ : కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఎండు మిర్చి తూకం వేస్తూ ఎండ వేడిమి తట్టుకోలేక హఠాత్తుగా కుప్పకూలి సర్వేశ్వర్ రెడ్డి అనే కార్మికుడు అక్కడికక్కడే చనిపోయాడు. కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి వందలాది మంది రైతులు తమ సరుకులు తీసుకుని మార్కెట్ యార్డ్ కు వస్తుంటారు. మార్కెట్ యార్డ్ లో పనిచేస్తున్న కార్మికులకు కానీ, సరుకులు తీసుకుని వస్తున్న రైతుల ప్రాణాలకు ఏమాత్రం రక్షణ లేదని మార్కెట్ యార్డు యాజమాన్యం నిబంధనలన్నీ తుంగలో తొక్కుతున్నారని, రైతులు కార్మికుల ప్రాణాలు పోతున్న మార్కెట్ పాలకమండలి, మార్కెట్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని సిఐటియు జిల్లా నాయకులు గౌస్ దేశాయ్, టి.రాముడు విమర్శించారు. ఆయన చనిపోయిన మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కనీసం ఆ పరిసర ప్రాంతాలకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. మిర్చి టెండర్ల కోసం కేటాయించిన సెడ్లను వ్యాపారస్తులకు ఇవ్వడం వల్ల ఉన్న ఒక షెడ్డులో మాత్రమే ఎండుమిర్చి వేస్తే సరిపోక ఎండలో రోడ్డు మీద వేయడం వల్ల  విపరీతమైన ఎండ కావడంతో ఒకవైపు మిర్చి ఘాటు మరోవైపు  ఎండ వేడిమి తట్టుకోలేక కుప్పకూలి కార్మికుడు చనిపోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని ఈ కార్మికుడు చనిపోవడానికి మార్కెట్ యార్డ్ యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. అలాగే నిన్నటి రోజు బుధవారం అనంతపురం నుంచి పంట తీసుకుని వచ్చిన రైతు మార్కెట్ యార్డ్ లో ఎండ వేడిమి తట్టుకోలేక చనిపోతే ఆ రైతు కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా ఆగమేఘాల మీద శవాన్ని బయటికి పంపించారన్నారు. రైతులు, కార్మికుల ప్రాణాలు అంటే ఎంత అలుసుగా ఉందో ప్రజలు గమనించాలని తెలిపారు.
గతంలో ఇలాగే మార్కెట్ యార్డ్ లో పనిచేస్తూ ఉల్లిగడ్డ హమాలీలు ముగ్గురు మాధవరావు, నర్సిగిడ్డయ్య, కాసిం, లారీ హామాలి సుబ్బన్న, బుడ్డల పట్టుబడి హమాలీ ఆంజనేయులు మార్కెట్ యార్డ్ లో పనిచేస్తూ పనిలో ఉండగానే చనిపోయారని ఇప్పటివరకు ఆ కుటుంబాలకు ఎటువంటి భీమా పథకం గాని, నష్టపరిహారం గాని అందలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకంగా వరుసగా మార్కెట్ యార్డ్ లో రైతులు కార్మికులు చనిపోతున్న పాలకవర్గం మాత్రం నిమ్మకునీరెత్తినట్లు ఉన్నదని కార్మికులు, కార్మిక సంఘాలు అనేక మార్లు విజ్ఞప్తి చేసిన చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు ఉందని మండిపడ్డారు. అందుకోసమే తక్షణమే  కార్మికులు ఆందోళనలకు పూనుకోవడానికి సిద్ధమవుతున్నారని వారు తెలిపారు.