Jun 18,2023 07:34
  • ఖరీఫ్‌ సమీపిస్తున్నా లక్ష్యంలో తీవ్ర వెనుకబాటు
  • ఎస్‌సి, ఎస్‌టికి నామమాత్రంగా పనులు

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : ఉపాధి కార్మికులకు పనుల కల్పనలో గుంటూరు జిల్లా వెనుకబడింది. జిల్లాలో రూ.120 కోట్ల మేరకు పనులు లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.40 కోట్ల మేరకు మాత్రమే పనులు జరిగాయి. ఉపాధి హామీ పనులు ప్రారంభమై 75 రోజులు పూర్తయినా, కొన్ని గ్రామాల్లో కనీసం ఐదు శాతం పనులు కూడా జరగలేదు. కొన్ని గ్రామాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, మరికొన్ని గ్రామాల్లో టెక్నికల్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్ల కొరత వేధిస్తోంది. దీంతో, పనుల గుర్తింపు మొదలుకొని కల్పన వరకూ వెనుకబాటు ఉంది. ఎస్‌సి, ఎస్‌టిలకు పనుల కల్పనలో అలసత్వం స్పష్టంగా కనబడుతోంది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు కిందిస్థాయి అధికారులు పనిచేయడం లేదని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని 17 మండలాల్లో ఈ ఏడాది 30 లక్షల పని దినాలు కల్పించాలనేది లక్ష్యం. గడిచిన 75 రోజుల్లో కనీసం 14 లక్షల పనిదినాలు కూడా కల్పించలేదు. మరో పక్షం రోజుల్లో ఖరీఫ్‌ పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో, వ్యవసాయ పనులు దొరుకుతున్నాయనే పేరుతో అధికారులు ఉపాధి పనులను నిలిపివేసే అవకాశం ఉంది. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఈ ఏడాది ఉపాధి పనులు కనీసం 20 శాతం కూడా పూర్తి కాలేదు. వట్టిచెరకూరు, కొల్లిపర, తుళ్లూరు, గుంటూరు రూరల్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో 15 నుంచి 19 శాతం మాత్రమే పనులు జరిగాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి జూన్‌ 15వ తేదీ వరకు మందగమనంగా సాగాయి. జిల్లా మొత్తమ్మీద ఐదారు మండలాల్లోనే పనులు 60 శాతం వరకు జరిగాయి. గుంటూరుకు సమీపంలోని వట్టిచెరకూరు మండలం చమళ్లమూడిలో 51 మంది ఎస్‌టిలు ఉంటే వారిలో ఇద్దరికి, 216 మంది ఎస్‌సిలు ఉంటే వారిలో నలుగురికి, వింజనంపాడులో 222 జాబ్‌ కార్డులు ఉంటే ఇప్పటివరకు నలుగురికి మాత్రమే పనులు కల్పించారు. గుంటూరు రూరల్‌ మండలంలో గరిష్టంగా 19.9 శాతం మాత్రమే పనులు జరిగాయి. కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో పనుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం కన్పిస్తోంది. ఈ మండలంలోని తుమూలూరులో 51 మంది ఎస్‌టిలు ఉండగా, వారిలో ముగ్గురికి మాత్రమే పనులు కల్పించారు. ఈ గ్రామంలో 750 జాబ్‌ కార్డులు ఉండగా, వంద మందికి కూడా పని కల్పించలేదు. ఒక్కో కుటుంబానికి ఒక్కో జాబ్‌ కార్డు ఉరడగా, కుటుంబంలో ఒక్కరికి కూడా పని దక్కని పరిస్థితి చాలా గ్రామాల్లో ఉంది. ఉపాధి పనులు పూర్తి స్థాయిలో కల్పించాలని జాబ్‌కార్డుదారులు కోరుతున్నారు.