- తొలుత ఐదు లక్షల మందితో చేయించాలని నిర్ణయం
- లక్ష్యం పూర్తి కాకపోవడంతో 3.70 లక్షలకు కుదింపు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : సామూహిక గృహ ప్రవేశాలకు ప్రభుత్వం తాజాగా మరో తేదీని నిర్ణయించినట్లు తెలిసింది. వచ్చే నెల 15న రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు మౌఖిక ఆదేశాలు వచ్చాయి. ఆ తేదీ నాటికి ఇళ్లను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగా ఐదు లక్షల మందితో కాకుండా 3.70 లక్షల మందితోనే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించినట్లుగా సమాచారం.
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు (ఎన్‌పిఐ) పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 16,60,171 ఇళ్లను మంజూరు చేసింది. వీటిని పలు దశల్లో చేపడుతూ 2024 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. తొలుత ఐదు లక్షల ఇళ్లను పూర్తి చేసి ఈనెల 22న ఉగాది సందర్భంగా అందరితో ఒకేసారి గృహ ప్రవేశాలను చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాల వారీగా లక్ష్యాలనూ నిర్ధేశించింది. ఆ రోజుకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో ఈనెల 25వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పైగా అనుకున్న మేర ఇళ్లు కూడా సిద్ధం కాలేదు. దీంతో ప్రభుత్వం సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని వాయిదా వేసింది. తాజాగా వచ్చే నెల 15న చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. లక్ష్యం పూర్తి కాక పలుమార్లు వాయిదా పడుతుండడంతో కొంతమేర దాన్ని కుదించింది. గతంలో ఐదు లక్షల మందితో చేయించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పుడు 3,70,141 మందితో ప్రవేశాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు 3,20,977 ఇళ్లు (87 శాతం) పూర్తయ్యాయి.
అధికారుల ఉరుకులు పరుగులు
సామూహిక గృహ ప్రవేశాలపై అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో క్షేత్రస్థాయి సిబ్బందితో వీడియో, టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ లక్ష్యం చేరుకునేలా చూడాలంటూ సూచిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యానికి చేరుకోవాలంటే ఇంకా 49,164 ఇళ్లు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికి ఒక్రటెండు జిల్లాలు బాగా వెనుకబడ్డాయి. ఎస్‌పిఎస్ నెల్లూరు జిల్లా 70 శాతంతో అట్టడుగున ఉంది. చిత్తూరు జిల్లాలో 73 శాతం ఇళ్లు పూర్తయ్యాయి. అనంతపురం జిల్లాలో 78 శాతం ఇళ్లు నిర్మాణమయ్యాయి. సత్యసాయి, అన్నమయ్య, పల్నాడు జిల్లాలు చెరో 79 శాతం మేర ఇళ్లు పూర్తయ్యాయి.
ఈ సారైనా ప్రవేశాలు జరిగేనా ?
సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం ఇప్పటివరకు ఐదు పర్యాయాలు వాయిదా పడ్డాయి. 2022లో విజయదశమి రోజున నిర్వహిస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజైన డిసెంబర్ 21 చేపడతామని నిర్ణయించింది. గృహ నిర్మాణాల లక్ష్యం కనీసం సగం కూడా పూర్తి కాకపోవడంతో వాయిదా వేసింది. ఈ ఏడాది మార్చి 22న ఉగాది సందర్భంగా అందరితో గృహ ప్రవేశాలు జరుపుతాయమని తెలిపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, అనుకున్న లక్ష్యం పూర్తి కాకపోవడంతో మళ్లీ వాయిదా వేసింది. తాజాగా వచ్చే నెల 15న నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తోంది.










