- రూ.10కే కిలో పండ్లు
- నిలిచిపోయిన ఎగుమతులు
- మార్కెట్ సదుపాయం కల్పించని ప్రభుత్వం
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : మామిడి ధర పతనమైంది. కిలో పది రూపాయలకు పడింది. ఇక్కడి ఎగుమతులు కూడా నిల్చిపోయాయి. ప్రభుత్వం మార్కెట్ సదుపాయం కల్పించకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మామిడి సాగులో ఉమ్మడి విజయనగరం జిల్లా రాష్ట్రంలో తృతీయ స్థానంలో ఉంది. మధురమైన భంగినపల్లి, నోరూరించే సువర్ణరేఖ, చెరుకు రసాలు, పనుకులు వంటి ఎన్నో రకాలకు ప్రసిద్ధి. సుమారు 1.05 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. సాగుదార్లంతా చిన్న, సన్నకారు రైతులే. కొందరు మామిడి తోటలను లీజుకు తీసుకుని సాగు చేస్తున్నారు. భూసారం, రకాన్ని బట్టి గతంలో ఎకరాకు 2.5 టన్నుల నుంచి 3 టన్నుల వరకు దిగుబడి వచ్చేది. గొప్పులు, దుక్కులు, క్రిమిసంహారక మందులు, కొమ్మకత్తిరింపులు తదితరాలకు ఎకరా ఒక్కంటికీ రూ.25 వేల వరకు పెట్టుబడి అవుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల దశాబ్ద కాలం నుంచి మామిడి దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ ఏడాది కూడా 20 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గాయని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ మార్కెటింగ్ సదుపాయం కల్పించకపోవడంతో సాగుదారులు పూర్తిగా దళారులపై ఆధారపడాల్సి వస్తోంది. ఇక్కడి నుంచి కోల్‌కత్తా, ముంబయి, భువనేశ్వర్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, రూర్కెలా వంటి మహానగరాలకు ఏటా వ్యాపారుల ద్వారా లక్షల టన్నుల మామిడి పళ్లు ఎగుమతి అవుతుంటాయి. ఈ ఏడాది ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబయ వంటి మహానగరాల నుంచి ఆర్డర్లు లేకపోవడంతో వ్యాపారులు మామిడి కొనుగోలుకు ముందుకు రావడం లేదు. గతేడాది సువర్ణరేఖ 16 కేజీల బాక్సుకు రూ.వెయ్యి వరకు ధర వచ్చింది. ఈ ఏడాది మేలో రూ.500 నుంచి రూ.600కు మించలేదు. అన్నీపోగా బాక్సుపై రూ.100 కూడా మిగలడం లేదని రైతులు మే మొదటి వారం వరకు వాపోయారు. ప్రస్తుతం ఎగుమతులు నిలిచిపోవడంతో విజయనగరం, ఆ చుట్టుపక్కల పట్టణ ప్రాంతాల్లోనూ, రైతు బజార్లలోనూ కిలో రూ.10 నుంచి రూ.15 చొప్పున విక్రయించుకోవాల్సిన వస్తోందని తెలిపారు. మిగిలిన రకాలదీ అదే పరిస్థితి. అన్నీ ఒకేసారి పక్వానికి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఎగుమతులు నిలిచిపోవడంతో ఏటా ఈ సీజన్‌లో లోడింగ్ చేసే కార్మికులు కూడా ఉపాధి కోల్పోయారు. గత ఏడాది విజయనగరం మామిడి ఢిల్లీలోని ఆదర్శ మార్కెట్‌కు వస్తోందంటూ ప్రధాని మోడీ ప్రశంసించారు. వారికోసం రైళ్లల్లో కిసాన్ వ్యాగన్లు ఏర్పాటు చేసి, రవాణా ఛార్జీల్లో 50 శాతం రాయితీ కల్పిస్తున్నామని ప్రకటించారు. వాస్తవానికి ఆ రాయితీ రైతులకు అందలేదు. ఈ ఏడాది అటువంటి మాట సాయం కూడా కరువైంది. రెండు దశాబ్దాల క్రితం విజయనగరం జిల్లా కేంద్రంలో రైల్వే ట్రాక్‌కు ఆనుకుని నిర్మించిన గోదామును కూడా వినియోగంలోకి తేలేదు.

ప్రభుత్వమే ఆదుకోవాలి
నాకున్న పదెకరాలతోపాటు మరో పది ఎకరాలు మామిడి తోట లీజుకు తీసుకుని జీవనం సాగిస్తున్నాను. ఎగుమతులు నిల్చిపోయాయనే పేరుతో వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. స్థానికంగా విక్రయించుకుందామనుకున్నా గత ఏడాది రూ.60 నుంచి రూ.70 వరకు పలికే సువర్ణరేఖ, బంగినపల్లి ధర ఈ ఏడాది రూ.10కి మించడం లేదు. గత 20 ఏళ్లలో మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
- పెంటపల్లి సత్యనారాయణ, మామిడి రైతు, బుడతనాపల్లి, విజయనగరం జిల్లా

ప్రభుత్వం కొనుగోలు చేయాలి
మామిడి పండ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా మార్కెట్ సదుపాయం కల్పించాలి. జిల్లాలో కోల్డ్ స్టోరేజీలు, మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలి. లేదంటే జిల్లాలో వరి తరువాత అంతటి ప్రాధాన్యతగల మామిడి సాగు తగ్గిపోయే ప్రమాదం ఉంది.
- బుద్దరాజు రాంబాబు, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి

ప్రభుత్వ మార్కెట్ అంటూ లేదు
జిల్లాలో మామిడి కొనుగోలుకు ప్రభుత్వ మార్కెట్ అంటూ లేదు. నేరుగా వ్యాపారులే కొనుగోలు చేస్తుంటారు. ముందస్తుగా అడ్వాన్సులిచ్చి కోతకు ఆర్డర్ ఇస్తారు. ఇందుకోసం బాక్సులు కూడా వారే సరఫరా చేస్తుంటారు.
- ఎవిఎస్‌వి జమదగ్ని, జిల్లా ఉద్యాన శాఖాధికారి, విజయనగరం










