Jul 08,2023 08:18

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : విజయనగరం జిల్లాలో ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, యాజమాన్యాలు తొందరపడి లాకౌట్‌ ప్రకటించవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా పరిషత్తు సమావేశానంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో పొందిన లాభాల నుంచి నష్టాలను పూడ్చుకొని నిర్వహణను కొనసాగించాలని, అప్పటికీ నష్టాలొస్తే సహాయం అందించే విషయం పరిశీలిస్తామని తెలిపారు. ప్రభుత్వ విధానం ప్రకారం ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలకు విద్యుత్తు రాయితీ, పంపిణీ ఉంటుందని, యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సహకార రంగ పరిశ్రమలను ప్రభుత్వం మూసివేస్తుందా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. చెరకు మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు పంట సాగు తగ్గించారని, సామర్థ్యానికి తగ్గట్టు చెరకు ఉత్పత్తి లేకపోవడం వల్ల భీమసింగి చక్కెర ఫ్యాక్టరీ నిర్వహణ సాధ్యం కాలేదన్నారు. లక్షకు పైగా ఎకరాల్లో చెరకు పండించాల్సి ఉండగా ప్రస్తుతం 20 వేల ఎకరాల్లోనే చెరకు సాగవుతోందని, రైతులు తగినంత చెరకు పండిస్తే ఫ్యాక్టరీని నడపడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. ప్రస్తుతం చెరకు రైతులకు ఇబ్బంది లేకుండా సంకిలి చక్కెర కర్మాగారంలో క్రషింగ్‌ చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. సహకార రంగ పరిశ్రమలను మూసివేసిన ఘనత చంద్రబాబుదేనని ఆక్షేపించారు.