- ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సర్దుబాటు
- విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలో రిజర్వు టీచర్లను ఉంచుతామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రతి కేంద్రంలో సుమారు ఐదుగురు వరకు వీరు ఉంటారని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో సమగ్రశిక్షా కార్యాలయంలో సోమవారం ఆయన చర్చలు జరిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రిజర్వు టీచర్లను ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సర్దుబాటు చేస్తామన్నారు. ఏదైనా పాఠశాలలో టీచర్ సెలవులో ఉంటే వీరిని ఆ సమయంలో అక్కడికి పంపుతామన్నారు. మొత్తం 9 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు రాష్ట్రంలో ఉన్నాయని వెల్లడించారు. ఉపాధ్యాయులకు బోధన తప్ప బోధనేతర పనులు చెప్పబోమని అన్నారు. ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా నిర్వహించామన్నారు. మొత్తం 1.75 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 82 వేల మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. 56 వేల మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారని చెప్పారు. బదిలీల్లో పొరపాటు జరిగినట్లు కొన్నిచోట్ల ఫిర్యాదులు అందాయని, వీటిని పరిశీలించి న్యాయం చేస్తామని అన్నారు. సీనియర్ ప్రధానోపాధ్యాయులను రెండో ఎంఇఒలుగా నియమించామని తెలిపారు. కొత్తగా 679 ఎంఇఒ పోస్టులను భర్తీ చేశామన్నారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లతో బోధన చేయిస్తున్నామన్నారు. ఏదైనా పాఠశాలలో సబ్జెక్టు టీచర్ లేకపోతే దగ్గరలోని ఎస్‌సి, బిసి, ఎస్‌టి రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించుకోవాలని సూచించారు. పాఠశాలల్లో వాచ్‌మెన్ పోస్టులకు ప్రభుత్వం అనుమతిచ్చిందని చెప్పారు. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యాకానుక (జెవికె) కిట్ల పంపిణీ 78 శాతం పూర్తిచేశామని, మిగిలిన వాటిని వారంలో అందిస్తామన్నారు. సుమారు 60 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టివిలను ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు పార్వతి, జాయింట్ డైరెక్టర్లు మువ్వా రామలింగం, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.










