ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతున్న అవినీతి వల్ల ప్రభుత్వానికి రావాల్సినంత ఆదాయం రావడం లేదని కాగ్ మొట్టికాయలు వేసింది. రిజిస్ట్రేషన్ అధికారులు నిబంధనలు పాటించకపోవడం వల్ల నాలుగు కేసుల్లో రూ.7.27 కోట్లను నష్టపోవాల్సి వచ్చిందని కాగ్ పేర్కొంది. 57 దస్తావేజుల్లో లావాదేవీలు తప్పుగా వర్గీకరించడంతో రూ.2.10 కోట్లు స్టాంప్ డ్యూటీ తక్కువగా వచ్చిందని తెలిపింది. ఒకటి కంటే ఎక్కువ లావాదేవీలున్న దస్తావేజులకు సంబంధించిన 28 కేసుల్లో రూ.1.61 కోట్ల స్టాంప్ డ్యూటీ తక్కువగా విధించారని పేర్కొంది. మార్కెట్ రేటుకంటే తక్కువ రేటుతో ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడం, చదరపు గజం బదులు ఎకరాల పద్ధతిలో ధరను పరిగణనలోకి తీసుకున్న 27 డాక్యుమెంట్లలో రూ.1.10 కోట్లు నష్టం జరిగినట్లు పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఆస్తుల్లో ఉమ్మడి వాటాలను కలపని తొమ్మిది రిజిస్ట్రేషన్లకు సంబంధించి రూ.51.19 లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలిపింది. విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చిన భూమికి సంబంధించి ఆరేళ్లు గడిచినా భూ బదలాయింపు ప్రక్రియ ఖరారు చేయకపోవడంతో మిగతా భూమికి సంబంధించి ధర రూ.1.19 కోట్లు వసూలు చేయలేదని తెలిపింది. భూ మార్పిడి కోసం తక్కువ రేటు తీసుకోవడం వల్ల రూ.47.81 లక్షలు నష్టం వాటిల్లిందని పేర్కొంది.










