Mar 22,2023 12:21
  • కేజీ లైవ్‌ ధర రూ.44, రిటైల్‌ ధర రూ.90
  • నష్టాల బాటలో పౌల్ట్రీ రైతులు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : చికెన్‌ ధరలు నేలను తాకాయి. కోడి గుడ్డు ధరలూ క్రమంగా పతనమవుతున్నాయి. దీంతో, పౌల్ట్రీ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రెండ్రోజులుగా కేజీ చికెన్‌ లైవ్‌ ధర రూ.80 నుంచి రూ.44కు పడిపోయింది. రిటైల్‌ మార్కెట్లో రూ.90 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. కోడి గుడ్డు పేపరు ధర రూ.4.13 ఉండగా తొమ్మిది పైసలు కమీషన్‌పోను రైతుకు రూ.4.04 మాత్రమే దక్కుతోంది. చికెన్‌ లైవ్‌ ధర కనీసం రూ.80, కోడి గుడ్డు ధర రూ.5.50 లేనిదే గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు.
 

                                                         'తూర్పు' నుంచే 30 శాతం పెంపకం

ఉమ్మడి జిల్లాలో వ్యవసాయం తరువాత పెద్ద పరిశ్రమగా పౌల్ట్రీ ఉంది. సుమారు 300 పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. దాదాపు 1.40 కోట్ల కోళ్ల పెంపకం అవుతోంది. రాష్ట్రంలో ఐదు కోట్ల వరకూ కోళ్ల ఉత్పత్తి జరుగుతోంది. దీనిలో 30 శాతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే ఉంది. ఈ రంగంలో ప్రత్యక్షంగా 20 వేలమంది, పరోక్షంగా మరో 20 వేల మంది మొత్తం 40 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ పరిశ్రమకు లారీ పరిశ్రమ అనుబంధంగా ఉపాధి పొందుతోంది. రైతుల వద్ద కోళ్లను కొనుగోలు చేసిన వారు లారీల్లో ఒడిశా, బీహార్‌, బెంగాల్‌ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటాయి. ఈ రాష్ట్రాలకే ఆంధ్ర నుంచి అత్యధికంగా కోళ్లు ఎగమతి అవుతుంటాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో పౌల్ట్రీకి ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇస్తున్నాయి. ఫలితంగా ఒడిశా, బీహార్‌, బెంగాల్‌ రాష్ట్రాల్లో పౌల్ట్రీ ఉత్పత్తి ఘననీయంగా పెరిగింది. ఈ ప్రభావం జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. ఇక్కడి నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. ఉత్పత్తికి తగినట్లుగా ఎగుమతులు లేకపోవడంతో ధరల పతనమయ్యాయి. వారం రోజుల వరకూ కెజీ చికెన్‌ ధర (స్కిన్‌ లెస్‌) రూ.220 ఉండేది. ప్రస్తుతం రూ.140 ఉంది.
 

                                                       పెరిగిన పెట్టుబడి ఖర్చులు

కోళ్ల పెంపకానికి మొక్కజొన్న, సోయా దాణాను అధికంగా వాడుతుంటారు. మొక్కజొన్న దాణా టన్నుకు ఏడాదిలో రూ.18 వేల నుంచి రూ.25 వేలు, సోయా రూ.50వేల నుంచి రూ.80 వేలకు పెరిగింది. లేబర్‌ ఛార్జీ, మెడిసిన్‌ ఖర్చు, కరెంట్‌ ఛార్జీలు అదనం. కిలో లైవ్‌కు రూ.80 లేనిదే కనీసం గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం లైవ్‌ కిలో రూ.44 మించకపోవటంతో పెట్టుబడి ఖర్చులు కూడా రావట్లేదని వాపోతున్నారు. ఫారంలో పది వేల కోళ్లను పెంచడానికి రూ.15.50 లక్షల వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ప్రస్తుతం ధర ప్రకారం రూ.4 నుంచి రూ.6 లక్షలు కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు చెప్తున్నారు. పది వేళ్ల కోళ్లను పెంచే ఫారం యజమానికి రూ.5 లక్షలకు పైబడి నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

                                                    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

పౌల్ట్రీ రైతులకు కోళ్ల పెంపకానికి అవసరమైన దాణా, మొక్కజొన్న, జొన్నలు, సోయా దాణాలను సబ్సిడీపై అందించాలి. విద్యుత్తు బిల్లులో రాయితీ ఇవ్వాలి. బ్యాంకుల నుంచి సబ్సిడీపై రుణాలు ఇస్తేనే తప్ప, పౌల్టీ మనుగడ సాధ్యం కాదు. గతంలో ఇచ్చిన రుణాలకు వడ్డీ మాఫీ చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తే పౌల్ట్రీ పరిశ్రమతోపాటు అనుబంధ రంగమైన లారీ పరిశ్రమకు ఊరట కలుగుతుంది. లేనిపక్షంలో దీనిపై ఆధారపడిన వేలాది మంది భవిష్యత్తు ప్రశ్నార్థకమే.
- పడాల సుబ్బారెడ్డి, అధ్యక్షులు, అనపర్తి ప్రాంతీయ కోళ్ల రైతుల సమన్వయ సంఘం