Jun 17,2023 10:01
  • అడవిలోకి అనుమతించని అటవీ శాఖాధికారులు
  • బిజెపి సర్కార్‌ నిర్ణయంతో విలీన గ్రామాల ప్రజలపై ఆంక్షలు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : వెదురుతో బుట్టలు అల్లి వాటిని వారపు సంతల్లో విక్రయించుకొని జీవనోపాధి పొందుతున్న విలీన మండలాల్లోని గిరిజనులకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా కష్టాలు వచ్చి పడ్డాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు చేసి రిజర్వు ఫారెస్టు, సోషల్‌ ఫారెస్టుగా అడవిని విభజించింది. దీంతో, అప్పటి నుంచి వెదురు కోసం గిరిజనులను రిజర్వు ఫారెస్టులోకి వెళ్లనీయకుండా అటవీ శాఖాధికారులు అడ్డుకుంటున్నారు. వెదురు కోసం గిరిజనులు అడవిలోకి వెళ్తే వారి వద్ద వ్యవసాయ, ఇతర పరికరాలను లాగేసుకుంటున్నారు. కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. దీంతో, విలీన మండలాల్లోని గిరిజనులకు ఉపాధి కరువుతోంది. పొట్ట నింపుకోవడానికి కూలి పనులకు వెళ్లాల్సి వస్తోంది. కూలి పనుల సరిగా దొరక్క తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
          అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, విఆర్‌.పురం, కూనవరం మండలాల్లో వెదురు బుట్టలు అల్లే గిరిజన (కొండరెడ్లు) కుటుంబాలు ఉన్నాయి. కూటూరు గట్టు, వేకులొద్ది, బండారుగూడెం, టేకులూరు, ఉల్లెట్టువాడ, చదలవాడ, తులసిపాక, ఏరువాడ, విద్యానగరం, ఎర్రగొండ పాకల, ఉప్పనపల్లి, ఉప్పనపల్లిగట్టుల వీరు ఎక్కువగా ఉన్నారు. బుట్టలు, చాటలు, చాపలు, ధాన్యం నిల్వ చేసుకునే గాదెలు, ఇంటి ఆవరణలో నిలిపే తడికెలు, ఉల్లి, ఎండు చేపల నిల్వలకు బుట్టలు అల్లుతుంటారు. వాటిని వారపు సంతల్లో విక్రయించి జీవనోపాధి పొందుతున్నారు. పెద్ద గంపను రూ.200కు, చిన్న గంపను రూ.80, తమలపాకు గంపను రూ.50, కోడి గంపను రూ.300 నుంచి సైజును బట్టి రూ.500కు అమ్ముతున్నారు. అడవికి వెళ్లి వెదురు తెచ్చుకుని బుట్టలు అల్లుతుండేవారమని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేకపోవడంతో రైతుల నుంచి వెదురు కొనుగోలు చేయాల్సి వస్తోందని గిరిజనులు తెలిపారు. రైతులు కూడా ఇటీవల వెదురు సాగు నిలిపివేశారని, దీంతో, వెదురు దొరకడం మరింత కష్టంగా మారిందని, వ్యాపారుల వద్ద అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. వ్యాపారులు ఒక్కో వెదురును రూ.90 నుంచి 120 విక్రయిస్తున్నారని, అదే రైతుల దగ్గర అయితే రూ.30 నుంచి 40కే లభించేదని గిరిజనులు చెబుతున్నారు. అడవిలోని వెదురును తీసుకెళ్లడానికి అవకాశం కల్పిస్తే పెట్టుబడి ఖర్చు నుంచి తమకు ఊరట లభిస్తుందని, వినియోగదారులకు ధర తగ్గనుందని అంటున్నారు.
 

                                                                   వెదురుకు పెరిగిన డిమాండ్‌

ప్రస్తుతం డిమాండ్‌ పెరగడంతో నెలలో ఒక్కసారి మాత్రమే వెదురు వస్తోంది. దీంతో, కొద్దిపాటి వస్తువులనే గిరిజనులు తయారు చేయగలుగుతున్నారు. మిగిలిన రోజులు కూలి పనులకు వెళ్తున్నారు. గతంలో మామిడి కాయలను ఇతర ప్రాంతాలకు ఎగుమతికి వెదురు బుట్టలు ఉపయోగించేవారు. వీటి ధర పెరగడంతో ప్రస్తుతం ప్లాస్టిక్‌ ట్రేలల్లో మామిడి కాయలు ఎగుమతి చేస్తున్నారు. దీంతో, గిరిజనులు అల్లుతున్న వెదురు బుట్టలకు గిరాకీ పూర్తిగా పడిపోయింది. తమలపాకుల గంప, కోడి గంపలకూ గిరాకీ తగ్గింది. ఎవరైనా అడిగితేగానీ తయారు చేయడం లేదని గిరిజనులు చెబుతున్నారు.

 

111

                                                                              సమస్య పరిష్కరించాలి

వెదురు కోసం చాలా కష్టాలు పడుతున్నాం. అటవీ శాఖాధికారులు ఇబ్బంది పెడుతున్నారు. గతంలో రైతుల నుంచి వెదురు కొనుగోలు చేసేవాళ్లం. గిట్టుబాటు కాక రైతులు వెదురు సాగు బాగా తగ్గించేశారు. వెదురు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అటవీ శాఖాధికారులు, సిబ్బంది దాడులు ఆపాలి.
                                -పదం దూల, జగ్గారం, ఎటపాక మండలం

 

222

                                                                                  అనుమతి ఇవ్వాలి

అడవిలోని వెదురుకు తెచ్చుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. వెదురు ఉంటే మాకు ప్రతిరోజూ పనులు ఉంటాయి. తెలియని కూలి పనులకు వెళ్లి ఏమీ చేయలేకపోతున్నాం. అవి కూడా రోజూ ఉండడం లేదు. గిరిజన కుటుంబాల వెదురు కష్టాలను ప్రభుత్వం తీర్చాలి.
                                                                                          - కాంతారావు, శ్రీరాంగిరి, విఆర్‌.పురం మండలం