Jun 06,2023 08:53
  • 41.15 కాంటూరు నిర్వాసితులకు 2022 సెప్టెంబర్‌కు పరిహారం
  • ఇప్పటికీ 73శాతం మందికి అందలేదు
  • ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం పెంపుపైనా మౌనం
  • నేడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సిఎం పర్యటన

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : పోలవరం నిర్వాసితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. గతేడాది జులైలో విరుచుకుపడిన వరదలకు నిర్వాసితులంతా నెలల తరబడి పునరావాస కేంద్రాల్లో బతుకులు వెళ్లదీశారు. వారికి సెప్టెంబర్‌లో పరిహారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వస్తుండడంతో తమకిచ్చిన హామీల సంగతేంటంటూ నిర్వాసితులంతా ప్రశ్నిస్తున్నారు. గతేడాది జులై, ఆగస్టు నెలల్లో విరుచుకుపడిన వరదలకు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పోలవరం నిర్వాసిత కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ రెండు మండలాల్లో 107 గ్రామాలు ఉండగా, వాటిలో దాదాపు వంద గ్రామాల వరకూ వరద ముంపులో చిక్కుకుపోయాయి. కొన్ని గ్రామాల్లో ఇళ్ల పైకప్పుల పైనుంచి వరద నీరు పారింది. నిర్వాసితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇంట్లోని సామాన్లు మొత్తం పాడైపోయాయి. ప్రభుత్వం లెక్కలు కట్టిన 41.15 కాంటూరు, 45.72 కాంటూరుతో సంబంధం లేకుండా గ్రామాలన్నీ వరదల్లో చిక్కుకుని విలవిలలాడాయి. దాదాపు 25 వేల కుటుంబాలు నెలల తరబడి పునరావాస కాలనీల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. తినడానికి తిండిలేక, ఉండడానికి చోటులేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదల సమయంలో వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట గ్రామంలో పర్యటించిన సిఎం జగన్మోహన్‌రెడ్డి 2022 సెప్టెంబర్‌ నాటికి 41.15 కాంటూరు పరిధిలోని నిర్వాసిత కుటుంబాలకు పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. 45.75 కాంటూరు పరిధిలోని కుటుంబాలకు పరిహారం కేంద్రం సహకరిస్తే తప్ప ఇవ్వలేమని అన్నారు. సెప్టెంబర్‌ పూర్తయ్యి ఎనిమిది నెలలు గడిచిపోయింది. మళ్లీ జులై వచ్చేస్తోంది. నిర్వాసితులను మళ్లీ వరద భయం వెంటాడుతోంది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 41.15 కాంటూరు పరిధిలో 7071 కుటుంబాలు ఉన్నాయి. 2023 మే 18 నాటికి 1,943 కుటుంబాలకు మాత్రమే పరిహారం అందింది. ఇంకా 5,074 కుటుంబాలకు అంటే 73 శాతం మందికి పరిహారం అందలేదు. వరదల్లో ఇల్లు దెబ్బతిన్న కుటుంబాలకు రూ.పది వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బాధితుల్లో సగం మందికి కూడా పరిహారం అందకపోవడంతో గగ్గోలు మిగతా 7లో పెడుతున్నారు. 41.15 కాంటూరు పరిధిలో కుటుంబాలకే పరిహారం ఇవ్వకపోతే 45.75 కాంటూరు పరిధిలో ఉన్న 84 గ్రామాల్లోని 14,703 కుటుంబాలకు పరిహారం ఎప్పటికిస్తారో ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది. కేంద్రం మెడలు వంచి పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
 

                                                                  పరిహారం పెంపు హామీపై మౌనం

తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం నిర్వాసిత కుటుంబాలకు ఇస్తున్న రూ.6.36 లక్షల పరిహారాన్ని రూ.పది లక్షలకు పెంచుతామంటూ 2019 ఎన్నికలో వైసిపి హామీ ఇచ్చింది. 2006కు ముందు సేకరించిన భూములకు ఎకరాకు రూ.లక్షా 15 వేలు మాత్రమే ఇచ్చారు. ఆ భూములకు ఎకరాకు రూ.ఐదు లక్షల పరిహారం ఇస్తామని ప్రతిపక్ష నేతగా జగన్‌ ప్రకటించారు. నాలుగేళ్లు గడిచినా పరిహారం పెంపును అమలుకు నోచుకోలేదు. నిర్వాసితుల కోసం జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లోని నిర్వాసిత కాలనీల్లో నిర్మిస్తోన్న ఇళ్లు నేటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. 18 ఏళ్లు నిండిన యువతకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో ప్రభుత్వం తేల్చడం లేదు. 2017 జూన్‌ 30 కటాఫ్‌ తేదీగా నిర్ణయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడు గ్రామాన్ని ఖాళీ చేస్తారో అది కటాఫ్‌ తేదీగా నిర్ణయించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
 

                                                       41.15 కాంటూరులో కలిపే గ్రామాలపై ప్రకటనతో సరి

గతేడాది వరదల సమయంలో కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా గ్రామాలన్నీ ముంపునకు గురయ్యాయి. కాంటూరు లెక్కలు శాస్త్రీయంగా లేవని తేలింది. దీంతో, సిపిఎం, ప్రజాసంఘాల ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం కుక్కునూరు మండలంలో పది గ్రామాలను, వేలేరుపాడు మండలంలో ఎనిమిది మొత్తం 18 గ్రామాలను 41.15 కాంటూరు పరిధిలో కలుపుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకూ ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అవార్డు పాస్‌ చేయడం వంటి ఏ ఒక్క ప్రక్రియా జరగలేదు. దీంతో, ఆయా గ్రామాల నిర్వాసిత కుటుంబాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయి. వరదల సమయం దగ్గర పడుతున్నప్పటికీ నిర్వాసితుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిర్వాసితుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
 

                                                                నేడు పోలవరానికి సిఎం జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి పోలవరం ప్రాజెక్టుకు చేరుకుంటారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు వద్ద వున్న కాన్ఫరెన్స్‌హాల్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం తిరిగి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.