- పరిమాణం, లబ్ధిదారులు, సబ్సిడీ తగ్గుదల
- నిబంధనలతో సర్కారు కత్తెర
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతులకు విత్తన రాయితీ ఏడాదేడాది చిక్కిపోతోంది. మూడేళ్లల్లో ప్రభుత్వం రైతులకు రాయితీపై పంపిణీ చేసిన విత్తనాల పరిమాణం, లబ్ధిదారులు, సబ్సిడీ అమౌంట్ అంతకంతకూ కుంచించుకుపోతోంది. గడచిన మూడు సంవత్సరాల్లో తుపాన్లు, భారీ వర్షాలు, వరదలు, అక్కడక్కడ వర్షాభావం, డ్రైస్పెల్స్ వంటి విపత్తులు సేద్యాన్ని దెబ్బతీశాయి. పంట నష్టపోయిన రైతులు తిరిగి పంటలేసుకోడానికి 80 శాతం సబ్సిడీపై విత్తనాలిస్తున్నామని ఊదరగొట్టారు. సాధారణ ప్లాన్‌తో పాటు కంటింజెన్సీ ప్లాన్‌లో అదనంగా ఇచ్చామంటున్న విత్తనాలతో కలుపుకున్నా పంపిణీ చేసిన విత్తనాల పరిమాణం, లబ్ధిదారుల సంఖ్య, రాయితీ సొమ్ము ఏటేటా తగ్గుతూనే ఉంది. ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలను రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె)లో డి-కర్షక్ యాప్ ద్వారా పంపిణీ చేస్తోంది. భూమి రికార్డులు పక్కాగా ఉన్న వారికే యాప్‌లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రికార్డుల్లేని కౌలు రైతులకు రాయితీ విత్తనాలు అందట్లేదు. సిసిఆర్‌సి ఉన్న కౌల్దార్లకు విత్తనాలిస్తున్నా వారి సంఖ్య బహు స్వల్పం.
భారీ కోత
2020-21లో ఖరీఫ్, రబీ కలుపుకొని 8.41 లక్షల క్వింటాళ్లు 16.15 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. అందుకోసం రూ.216.02 కోట్లు ఖర్చు చేశారు. 2021-22లో 10.09 లక్షల క్వింటాళ్లు 16.37 లక్షల మందికి పంపిణీ చేశారు. రూ.265.31 కోట్లు వ్యయం చేశారు. ఆ ఏడాది నివార్ తుపానొచ్చి రైతులు పంట నష్టపోవడంతో రబీలో నార్మల్ ప్లాన్‌కు అదనంగా ఇండెంట్ పెట్టారు. ఆ కారణంగా ఈ సంవత్సరం సబ్సిడీ విత్తనాల పరిమాణం అంతకుముందు కంటే కొంత పెరిగింది. పెరిగిన లబ్ధిదారులు 20 వేలు మాత్రమే. ఖరీఫ్‌లో 80 వేల క్వింటాళ్లు, సుమారు 2.80 లక్షల లబ్ధిదారులు తగ్గారు. 2022-23లో రెండు సీజన్లూ కలుపుకొని 6.85 లక్షల క్వింటాళ్లు 11.92 లక్షల మందికి పంపిణీ చేశారు. రూ.189.71 కోట్లు ఖర్చు చేశారు. మునుపటి సంవ త్సరం కంటే ఈ తడవ 80 వేల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ తగ్గింది. దాదాపు 4 లక్షల మంది లబ్ధిదారులూ తగ్గారు.
బయటే తక్కువ
రాయితీ విత్తనాలను పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల కింద పంపిణీ చేస్తున్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు ప్రోత్సాహం, ఇత్యాది స్కీంల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మ్యాచింగ్ గ్రాంట్లతో రైతులకు సబ్సిడీ విత్తనాలిస్తున్నారు. నిర్ణయిస్తున్న సబ్సిడీ కొన్ని పంటలకే 50 శాతం. కొన్నింటికి అంత కంటే తక్కువ రాయితీ ఇస్తున్నారు.
విపత్తుల వంటి ప్రత్యేక సమయాల్లో మాత్రం 80 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. వాటి పంపిణీ చాలా తక్కువ. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విత్తనాల్లో వేరుశనగ పరిమాణం 70 శాతం వరకు ఉంటుంది. రైతుల అవసరంలో ప్రభుత్వం ఇచ్చే రాయితీ విత్తనాల పరిమాణం తక్కువ. వాటికీ ఆన్‌లైన్, పరిమితులు, నిబంధనలతో సబ్సిడీ సీడ్ పంపిణీని తగ్గిస్తోంది. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీ భరించాక కూడా రాయితీ విత్తనాల ధర బహిరంగ మార్కెట్‌తో సమానంగా ఉంటోంది. సేకరణలో అవినీతి అక్రమాల వలన నాసిరకం విత్తనం ఇస్తున్నారు. ధర నిర్ణయంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీంతో రైతులు సబ్సిడీ విత్తనాలపట్ల అనాసక్తి వ్యక్తం చేస్తున్నారు. సేద్యం భారం కావడంతో రైతులు వ్యవసాయాన్ని చాలించడం వలన సబ్సిడీ విత్తనాల సేల్స్ తగ్గుతున్నాయి.











