Jun 17,2023 09:48

            ఉమ్మడి పౌర స్మృతిపై ప్రజల నుండి అభిప్రాయాలు కోరాలని లా కమిషన్‌ తీసుకున్న నిర్ణయం వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజల మధ్య విభజన తీసుకువచ్చేందుకు ఉద్దేశించిన రాజకీయ చొరవగా కనిపిస్తోంది. గత లా కమిషన్‌ ఇదే విధంగా అభిప్రాయాలు కోరి సంవత్సరాలు గడిచిపోయాయని, అందువల్ల తిరిగి ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించేందుకు తాజాగా ప్రయత్నం చేపట్టడం అవసరమని 22వ లా కమిషన్‌ పేర్కొంది. ఉమ్మడి పౌర స్మృతి ఈ దశలో అవసరం లేదని లేదా వాంఛనీయం కూడా కాదని స్పష్టంగా చెబుతూ 2018లో 21వ లా కమిషన్‌ ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. వివిధ మతాలకు సంబంధించిన చట్టాల్లో ఏకరూపతను లేదా సారూప్యతను తీసుకురావడానికి ప్రయత్నించడం కన్నా వివిధ పర్సనల్‌ చట్టాలను సంస్కరించేందుకు తీసుకునే చొరవల దృష్టి అన్ని రకాల వివక్షను నిర్మూలించేలా వుండాలని సహేతుకమైన ఆ పత్రం వాదించింది. స్వభావరీత్యా ప్రగతిశీల పంథాలో వున్న ఆ పత్రం, ఏకరూపత లేదా సారూప్యతపై వివక్ష వుండకూడదని నొక్కి చెప్పింది, పైగా సమాజంలో ఒకే రకమైన నిబంధనలు అందరిపైనా విధించడానికి బదులుగా వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి అంశాలు పర్సనల్‌ లాని నిర్దేశించే విభిన్న మార్గాలుగా వుండగలవని గుర్తించింది. వివక్షాపూరితమైన నిబంధనలను ముఖ్యంగా మహిళలను ప్రభావితం చేసే అంశాలను తొలగించాలని కోరుతోంది. సమానత్వంలో పాతుకుపోయిన కొన్ని విస్తృతమైన నిబంధనలను స్వీకరించాలని పేర్కొంటోంది. ఈ అంశాన్ని తిరిగి ఎన్నికల రంగంలోకి తీసుకురావడానికి ప్రస్తుత ప్రభుత్వానికి గల రాజకీయ అవసరం తప్ప తిరిగి తాజాగా సమీక్ష జరిపేందుకు అప్పటి నుండి గుర్తించదగిన మార్పులేవీ చోటు చేసుకోలేదు.
          యావత్‌ దేశానికి ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడమన్నది నిజంగా చాలా ఉన్నతమైన లక్ష్యమే, కానీ పర్సనల్‌ లా కి సంబంధించిన అన్ని అంశాలకు కలిపి ఒక్కదాన్నే తీసుకురావడమన్నది మత స్వేచ్ఛకు అడ్డు పడుతుందా లేదా అన్న ప్రశ్నపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇది వాంఛనీయమేనని బి.ఆర్‌.అంబేద్కర్‌ అభిప్రాయపడ్డారు. అయితే ఇది స్వచ్ఛందంగా వుండేందుకే ఆయన సుముఖత చూపారు. ఏ మతాన్ని దెబ్బతీయకుండా, ఇబ్బంది పెట్టకుండా ఉమ్మడి పౌర స్మృతిని ఆమోదించవచ్చన్నది సాధ్యమవుతుందన్నారు. అయితే, ఈ భావన మైనారిటీల్లోని కొన్ని వర్గాల్లో భయాందోళనలు రేపుతోంది. తమ పర్సనల్‌ లాకు మూలంగా చూసే తమ మతపరమైన విశ్వాసాలు దెబ్బతినవచ్చని భయపడుతున్నారు. ప్రస్తుతమున్నట్లుగా భయాందోళనలు నెలకొన్న సమయాల్లో ఉమ్మడి నిబంధనలు అనేవి అనివార్యంగా మెజారిటీ వర్గం వారు రుద్దేవిగానే చూడాల్సి వుంటుంది. అన్ని కమ్యూనిటీల వారికి, స్త్రీ, పురుషులకు వివాహ వయస్సును 18గానే వుంచడం వంటి మౌలిక సంస్కరణలు లేదా నిబంధనలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ''నో ఫాల్ట్‌' విడాకుల పద్దతి (ఎదుటి భాగస్వామిలో తప్పు వుందని రుజువు చేయాల్సిన అవసరం పిటిషనర్‌కి లేకపోవడం), కోలుకోలేని విధంగా సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయన్న కారణం ప్రాతిపదికగా వివాహ రద్దును అనుమతించడం, విడాకుల అనంతరం ఆస్తుల విభజనకు ఉమ్మడి నిబంధనలు కలిగి వుండడం వంటి అంశాలపై గత కమిషన్‌ చర్చ జరపాలని భావించింది. సమానత్వం, వివక్ష లేకపోవడం, నిషేధాలు మరియు మూసపోసిన పద్దతులపై ఆధారపడిన విధానాలను తొలగించడమన్నది ముందుగా ప్రతి కమ్యూనిటీ చట్టాల్లోనూ పొందుపరచాలన్నది వాంఛనీయంగా వుంటుంది.
- ది హిందూ సౌజన్యంతో