- ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి తిరుమలరావు
ప్రజాశక్తి-నందిగామ : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి న్యాయశాఖ ద్వారా పూర్తి సహకారం అందిస్తామని నందిగామ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి తిరుమలరావు పేర్కొన్నారు. నందిగామ మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నందిగామ మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో ఆదివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నందిగామ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి తిరుమలరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు తమ హక్కుల కోసం కార్మిక చట్టాల గురించి అవగాహన పెంచుకోవాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులు వృత్తి నైపుణ్యం పెంచుకోవడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగవచ్చు అని వివరించారు. భవన నిర్మాణ కార్మికులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ కష్టపడి పనిచేసి తమ కుటుంబ సభ్యులను సంరక్షించుకోవాలని కోరారు. కార్మికులకు ప్రమాద బీమా చట్టాల గురించి అవగాహన కల్పించారు. పలువురు భవన నిర్మాణ కార్మికులు నాయకులు మాట్లాడుతూ భవనిర్మాణ కార్మికులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న క్లైములు ప్రభుత్వం నుండి వచ్చే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక శాఖ అధికారులు న్యాయస్థానం వద్దకు పిలిపించి భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు బొందలపాటి రామకృష్ణ, కెవిఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్ రిటైర్డ్ తుర్లపాటి కోటేశ్వరరావు, న్యాయవాదులు, సిహెచ్ శ్రీనివాసరావు, దాసరి వెంకటేశ్వర రావు, గుర్రాల వెంకటరత్నం, కొమ్మినేని మౌళేశ్వరావు, రవికుమార్, సైదా, అద్దంకి మణిబాబు, నందిగామ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రామస్వామి యూనియన్ నాయకులు సీతారామయ్య, నరసింహారావు, బడే మియా పలువురు కార్మికులు పాల్గొన్నారు










