Sep 30,2020 07:38
Trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ ట్రంప్‌ నిరంకుశ పోకడలు పెచ్చుమీరుతున్నాయి. ఇవి అధ్యక్ష తరహా పాలన నుంచి అధ్యక్ష నియంతృత్వం వైపు ఆ దేశాన్ని నెట్టేవిగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన సాగిస్తున్న ప్రచార తీరు ప్రజాస్వామ్యవాదులందరినీ మరింత కలవరపరిచేదిగా ఉంది. ప్రజారోగ్యం, విద్య, ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, న్యాయ వ్యవస్థ, ఇతర ముఖ్యమైన రంగాలను ఇప్పటికే చాలావరకు భ్రష్టు పట్టించిన ట్రంప్‌ ఇప్పుడు ఎన్నికల వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నాడు. నవంబరు 3న జరిగే ఎన్నికల్లో తన ప్రత్యర్థి డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌కే విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయని దాదాపు అన్ని సర్వేలు చెబుతున్నాయి. దీంతో బెంబేలెత్తిన ట్రంప్‌, రిపబ్లికన్‌ పార్టీలోని ఆయన అనుయాయులు ఈ ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేందుకు రకరకాల కుయుక్తులు, కుతంత్రాలు పన్నుతున్నారు. కోవిడ్‌ మహమ్మారిని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేయాలని ట్రంప్‌ చూశాడు. అది కుదరకపోవడంతో పోస్టల్‌ బ్యాలెట్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. ఈ వాదనకు అమెరికన్ల నుంచి స్పందన ఏమీ రాకపోవడంతో ఎన్నికల్లో భారీ రిగ్గింగ్‌కు కుట్ర జరుగుతోందంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. 2016 ఎన్నికలకు ముందు కూడా ట్రంప్‌ ఇదే విధమైన ఆరోపణలు చేశారు. ఆ ఎన్నికల్లో భారీగా అక్రమ ఓటింగ్‌ జరిగిందని ట్రంప్‌ గగ్గోలు పెట్టాడు. తీరా ఆ ఎన్నికల్లో ఆయన గెలిచేసరికి గమ్మున ఉన్నాడు. ఇప్పుడీ ఎన్నికల్లో ట్రంప్‌నకు ఓటమి భయం పట్టుకుంది. అందుకే రిగ్గింగ్‌కు డెమొక్రాట్లు కుట్ర పన్నుతున్నారంటూ నిరాధారమైన ఆరోపణలకు దిగాడు. గత వారం వైట్‌ హౌస్‌లో జరిగిన మీడియా గోష్టిలో ఈ ఎన్నికల ఫలితాలను మీరు అంగీకరిస్తారా అని ఫ్యాక్స్‌ వార్తా సంస్థ ప్రతినిధి క్రిస్‌ వాలెస్‌ అడిగితే, దానికి సూటిగా సమాధానం చెప్పకుండా, ఏం జరుగుతుందో చూద్దాం, ఇప్పుడే దీనికి అవునని కానీ, కాదని కానీ చెప్పలేనని అన్నారు. ఎన్నికలు న్యాయంగా జరగలేదని తనకు అనిపిస్తే, ఆ ఫలితాలను గుర్తించబోను, కోర్టుకెెళ్తానన్నాడు. 20 ఏళ్ల క్రితం బుష్‌, అల్‌ గోరె మధ్య హోరా హోరీగా సాగిన ఎన్నికల పోరులో కోర్టు జోక్యం చేసుకుని ఫ్లోరిడాలో ఓట్ల లెక్కింపును నిలిపేసి, బుష్‌ను విజేతగా ప్రకటించింది. అటువంటి పరిస్థితిని ఇప్పుడు సృష్టించాలని ట్రంప్‌ చూస్తున్నాడు. లిబరల్‌ జస్టిస్‌ గిన్స్‌బర్గ్‌ ఇటీవల కన్నుమూయడంతో ఆ స్థానంలో ట్రంప్‌ పచ్చి మితవాది అయిన తన అనుయాయిని ఎంపిక చేశాడు. సెనేట్‌ ఆమోదిస్తే ఎన్నికలకు ముందే ఇది అమలులోకి రావచ్చు. అప్పుడు సుప్రీం కోర్టులో లిబరల్స్‌ కన్నా మితవాదులదే పైచేయి అవుతుంది. ఎన్నికల ఫలితాలపై కోర్టు జోక్యాన్ని కోరడం ద్వారా తీర్పు తనకు అనుకూలంగా వచ్చేలా చూసుకోవాలనేది ట్రంప్‌ ఆలోచన. ఆయన మద్దతుదారుడు రోజర్‌ స్టోన్‌ ఇంకో అడుగు ముందుకేసి ఈ ఎన్నికల్లో గనుక ట్రంప్‌ ఓడిపోతే 'మార్షల్‌ లా' ప్రకటించాలని సలహా ఇచ్చాడు. రోజర్‌ స్టోన్‌ ఓ క్రిమినల్‌ కేసులో దోషి. ట్రంప్‌ ఆయనకు క్షమాభిక్ష పెట్టాడు. ట్రంప్‌ మరో అనుచరుడు మైఖెల్‌ కేపుటో సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేస్తూ, ఎన్నికల తరువాత సాయుధ తిరుగుబాటుకు వామపక్ష ఓటర్లు కుట్ర పన్నుతున్నారని, దానిని ఎదుర్కోవాలంటే ముందు నుంచే ఆయుధాలు, మందుగుండు సామగ్రి సమకూర్చుకోవాలని తన మద్దతుదారులకు సూచించాడు. ట్రంప్‌ సైతం ఇటువంటి బెదిరింపులే చేస్తున్నాడు. పౌర అశాంతిని అణచివేయడానికి నేషనల్‌ గార్డ్స్‌ (సైన్యం)ను ప్రయోగించే అధికారం ఇన్‌సరెక్షన్‌ యాక్టు కింద తనకు ఉందని, ఎన్నికల రోజు రాత్రి అవసరమైతే దీనిని ప్రయోగిస్తానని ఇటీవల పదే పదే బెదిరిస్తున్నాడు. ట్రంప్‌, ఆయన అనుచరులు చేస్తున్న ఈ బెదిరింపులు అమెరికా ప్రజాస్వామ్యం నేడు ఎదుర్కొంటున్న దుస్థితికి దర్పణం పడుతున్నాయి. ట్రంప్‌ నిరంకుశ పోకడల పర్యవసానాలు ఆ ఒక్క దేశానికే పరిమితం కాదు. ఇతర దేశాలపై కూడా ఉంటుంది. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే వాతావరణ మార్పులకు సంబంధించిన పారిస్‌ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. ఇరాన్‌తో కుదుర్చుకున్న బహుళపక్ష అణు ఒప్పందం నుంచి ఉపసంహరించుకుని, ఆ దేశంపై తీవ్ర ఆంక్షలు విధించాడు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. యునెస్కోతో సంబంధాలు తెంచేశాడు. క్యూబాపై దీర్ఘకాలంగా కొసాగిస్తున్న ఆర్థిక, వాణిజ్య దిగ్బంధనానికి తోడు తాజాగా మరిన్ని ఆంక్షలు విధించాడు. ట్రంప్‌ అనుసరిస్తున్న ఈ నిరంకుశ పోకడలను అడ్డుకోకపోతే అమెరికాలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. దీనికి అమెరికాలో ప్రతిఘటన మొదలైంది. సమ్మెలు, నిరసనలు ఉధృతమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారిగా పరిణమించిన ట్రంప్‌ను ఇంటికి సాగనంపాల్సిన బాధ్యత అమెరికన్లదే.