- వారిది విభజన సిద్ధాంతం...మాది ఐక్యత సిద్ధాంతం
- ఇష్టాగోష్టిలో రాహుల్‌గాంధీ
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : నియంతృత్వంగా వ్యవహరించడమే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ డిఎన్‌ఎ అని ఎఐసిసి అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. ఆ పార్టీది విభజన సిద్ధాంతమైతే... తమది ప్రజల్ని కలిపే సిద్దాంతమని చెప్పారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక ప్రణాళికా భాగంగా రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న భారత్‌జోడో యాత్రలో భాగంగా సోమవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు గ్రామంలో మీడియాతో రాహుల్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వంటి వ్యవస్థల్లో ప్రభుత్వ జోక్యం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ పెట్టుబడిదారులకు అనుకూల విధానాలతో చిరు వ్యాపారులపై తీవ్రమైన ప్రభావం పడుతోందని చెప్పారు. మోడీ క్రోని కెపిటలిజాన్ని పెంచిపోషిస్తున్నారని విమర్శించారు. శాంతి, ప్రేమ, సౌభ్రతృత్వం కాంగ్రెస్ సంస్కృతి అయితే, అశాంతి, మతఘర్షణలు, అసహనం బిజెపి సంస్కృతి అని పేర్కొన్నారు. దేశంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీలు రెండూ కేవలం కొంతమంది లబ్దికోసం పనిచేస్తున్నాయని విమర్శించారు. వారి స్వలాభాల కోసం దేశ ఆర్థిక వ్యవస్థనే ఫణంగా పెట్టిన ఘనత బిజెపికి దక్కుతుందన్నారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి లబ్దిపొందాలనే కుట్రలతో బిజెపి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన యాత్రే భారత్ జోడో యాత్ర అని స్పష్టం చేశారు. దేశ ఐక్యతే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, అదే తమ అజెండా అని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి అంక్షలను పూర్తిగా ఎత్తివేసి అందరికీ స్వేచ్ఛయుత వాతావరణం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.










