న్యూఢిల్లీ : జొమాటో బాటలో స్విగ్గీ తన ఉద్యోగులపై కోత విధించేందుకు సిద్ధమైంది. తన 6వేల మంది ఉద్యోగుల్లో 8నుండి పది శాతం వరకు కోత విధించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉత్పత్తి, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ ఉద్యోగులపై కోతలు ప్రభావం చూపనున్నట్లు ఆ వర్గాలు వివరించాయి. స్విగ్గీ ఉద్యోగులందరికీ రేటింగ్ సిస్టమ్‌లో ఐదో నెంబర్ ఉందని, రెండు, అంతకంటే తక్కువ రేటింగ్ ఉన్న ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు పేర్కొన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి స్విగ్గీ ఐపిఓకు వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో ఐపిఒకు ముందు కంపెనీని లాభాల్లోకి తీసుకురావడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో జొమాటో 3 శాతం మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.










