Jul 08,2022 12:34

వాషింగ్టన్‌ : జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే (67) పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ప్రస్తుత ప్రధాని కిషిండ వెల్లడించారు. నరాలో శుక్రవారం జాతీయ ఎన్నికల ప్రచార ర్యాలీలో అబే ప్రసంగిస్తుండగా.. దుండగుడు కాల్పులు జరపడంతో అక్కడే కుప్పకూలిపోయారు. ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు.

షింజో అబే విద్య, రాజకీయ జీవితం
షింజో 1954లో టోక్యోలో జన్మించారు. షింజో అబే జపాన్‌కు రెండు సార్లు ప్రధానిగా వ్యవహరించారు. 2006-07తో పాటు 2012-20లో ఆయన దేశ ప్రధానిగా ఉన్నారు. అబే రాజకీయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చారు. ఆయన తాత కిషి నోబుసుకే 1957 నుండి 1960 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. అబే టోక్యోలోని సీకేయ్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొందారు. అనంతరం అమెరికాకు వెళ్లారు. లాస్‌ఏంజెల్స్‌లోని దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాయలంలో పొలిటికల్‌ సైన్స్‌ విద్యను అభ్యసించారు. అనంతరం 1979లో కోబ్‌ స్టీల్‌ లిమిటెడ్‌లో పనిచేశారు. 1980ల ప్రారంభంలో లిబరల్‌-డెమొక్రటిక్‌ పార్టీ (ఎల్‌డిపి)లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1982లో జపాన్‌ విదేశాంగ మంత్రిగా ఉన్న తన తండ్రి అబే షింటారోకు కార్యదర్శిగా వ్యవహరించారు. 2003లో ఎల్‌డిపి కార్యదర్శి అయ్యారు. 2006లో జపాన్‌ 90వ ప్రధానిగా ఎన్నికయ్యారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత పిన్న ప్రధానిగా షింజో అబే నిలిచారు. ఆ తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎల్‌డిపి ఘోర పరాజయంతో ఆయన ప్రధాని పదవిని వీడారు. 2012లో తిరిగి 96వ ప్రధాన మంత్రిగా అబే  ఎన్నికయారు. 2014, 17ల్లో మరోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. జపాన్‌కు అత్యధిక కాలం ప్రధానిగా.. అబే రికార్డు సృష్టించారు.

'అబేనామిక్స్‌' అనే పేరు ఎలా వచ్చిందంటే..?
అబేకు ఆర్థిక విధానాలపై మంచి పట్టు ఉందని అక్కడి ప్రజలు భావిస్తుంటారు. ఆర్థిక వృద్ధికి ఆయన తీసుకునే విధానాలను 'అబె నామిక్స్‌' అని పిలుస్తుంటారు. షింజో అబే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రక్షణ, సైనిక వ్యయాన్ని పెంచారు. పక్కా సంప్రదాయవాదిగా ఆయనకు ముద్ర ఉంది. షింజో ఆసియన్‌, భారత్‌, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఎంతో కృషి చేశారు. ప్రధాని మోడీ హయాంలో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ముఖ్య అతిధిగా హాజరైన తొలి జపాన్‌ ప్రధాని షింజో కావడం విశేషం. 2020 ఆగస్టులో అనారోగ్యం బారిన పడిన ఆయన... ప్రధాని పదవి నుండి వైదొలిగారు.

షింజో తాతపై కూడా హత్యాయత్నం
యాదృచ్ఛికమో లేక మరేమిటో తెలియదు కానీ.. గతంలో షింజో తాత, మాజీ ప్రధాని నోబుసుకే కిషిపై కూడా హత్యాయత్నం జరిగింది. ప్రధానిగా వైదొలుగుతున్న సమయంలో 1960లో మితవాద గ్రూపులకు అనుబంధంగా ఉన్న ఓ వ్యక్తి అతడిని కత్తితో పొడిచారు. తక్షణమే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా.. ప్రాణాలతో బయటపడ్డారు.